Oct 31,2023 00:07

వేదాంతపురం వెంచర్‌ తుడాదే : వీసీ

వేదాంతపురం వెంచర్‌ తుడాదే : వీసీ
ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌
తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం గ్రామ పరిధిలో తిరుపతి పట్టణాభివద్ధి సంస్థ(తుడా) విక్రయించిన ప్లాట్‌ కొనుగోలుదారులు అధైర్య పడాల్సిన అవసరంలేదని వీసీ హరికష్ణ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే తుడా అభివద్ధి చేసిన స్థలంలో లే ఔట్‌ వేసి ప్లాట్లు విక్రయించామని తెలిపారు. బాధితులకు పరిహారం చెల్లించి భూసేకరణ ప్రక్రియ ద్వారా భూములను స్వాధీనం చేసుకున్నామన్నారు. సోమవారం తుడా కార్యాలయంలో ఉపాధ్యక్షులు(వీసీ) హరికష్ణ విలేకరులతో మాట్లాడుతూ వేదాంతపురం గ్రామ పరిధిలోని తుడా లే ఔట్‌ లో ఆదివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా చొరబడటమే కాకుండా ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారన్నారు. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వీసీ తెలియజేశారు. వేదాంతపురం గ్రామ పరిధిలోని తుడా స్థలానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. వేదాంతపురం సర్వే నెం.196, 202, 203, 204లో 25.22 ఎకరాల భూమిని 1992లో ప్రభుత్వ నిబంధనల మేరకు తుడా భూ సేకరణ పద్దతి ద్వారా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కేటాయింపును సవాల్‌ చేస్తూ గతంలో హైకోర్టు లో సి.శంకర్‌ రెడ్డి, ఇ.పుల్లారెడ్డి ఇతరులు రిట్‌ పిటిషన్లు దాఖలు చేయగా, వాస్తవిక పరిస్థితుల ఆధారంగా కోర్టు పిటిషన్లను కొట్టివేసిందన్నారు. ఇలా పలుమార్లు పిటిషన్‌ లు దాఖలు చేశారని గుర్తు చేశారు. 2007 లో సుప్రీంకోర్టు లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. అక్కడ కూడా తుడా కు అనుకూలంగా అప్పీల్‌ ను కొట్టివేసినట్లు వివరించారు. 2020లో శంకర్‌ రెడ్డి కొడుకు వంశీ వర్ధన్‌ రెడ్డి రిట్‌ పిటీషన్‌ దాఖలు చేయగా సర్వే నంబర్‌ 203 లో 0.50 సెంట్లు స్థలంలో జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు, ఆ తరువాత 2023 లో పిటీషన్‌ కొట్టివేసిందన్నారు. ఆ తరువాత కూడా కోర్టు అప్పీల్‌ కు అవకాశం ఇచ్చినప్పటికీ ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. రెండు దశల్లో చేపట్టిన భూ సేకరణ ప్రక్రియలో పరిహారాన్ని బాధితుల బ్యాంక్‌ అకౌంట్‌ లలో జమ చేసినట్లు వివరించారు.