కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కే రామమోహనరావు
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : రానున్న విద్యా సంవత్సరం నుంచి కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ నాలుగేళ్ల కోర్సులను నిర్వహించనున్నట్లు ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కే రామమోహ నరావు తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, యజమాన్యాల సమావేశం విశ్వవిద్యాలయం సీడీసీ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హజరైన ఆచార్య కే రామమోహనరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా విశ్వవిద్యాలయం పరిధిలో అనేక నూతన చర్యలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి డిగ్రీ కోర్సును నాలుగేళ్ల కాల పరిమితికి పెంచనున్నట్లు చెప్పారు. నాలుగో ఏడాదికి సంబంధించి విద్యార్ధులు రీసెర్చ్, లేదా సాధారణ విద్యాభ్యాసం వైపు రెండు అవకాశాలను ఇవ్వటం జరుగుతుందన్నారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను రాష్ట్ర విద్యాఉన్నత విద్యామండలి విడుదల చేయనుందన్నారు. రిజిష్ట్రార్ ఎం రామిరెడ్డి మాట్లాడుతూ ఆచార్య ఎం రామిరెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా అనేక నూతన సంస్కరణలకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతుందన్నారు. దానికి అనుగుణంగా కష్ణా విశ్వవిద్యాలయం సైతం తన పరిధిలోని కళాశాలలను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సీడీసీ డీన్ డాక్టర్ డీ రామశేఖరరెడ్డి నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డీన్ డాక్టర్ ఆర్ విజయకుమారి, కేబీఎన్ కళాశాల కార్యదర్శి తూనుకుంట్ల శ్రీనివాసు, ప్రిన్సిపాల్ డాక్టర్ వీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రెండు జిల్లాల్లోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, యజమాన్యాలు పాల్గొన్నారు.










