Aug 19,2023 20:04

సంబరాలు చేసుకుంటున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - ఆదోనిరూరల్‌
అధికార పార్టీ వైసిపి పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వార్డు మెంబర్ల విజయంతో నాంది పలికామని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్‌ చౌదరి పేర్కొన్నారు. శనివారం ఆదోని టిడిపి కార్యాలయం ముందు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో శనివారం వెలువడిన వార్డు మెంబర్ల ఎన్నికల్లో టిడిపి బలపరిచిన ఇద్దరు వార్డు మెంబర్లు గెలిచారని తెలిపారు. పెద్దతుంబలం వార్డు మెంబర్‌ ఆంజనేయ 80, బసాపురం గ్రామంలో వార్డు మెంబర్‌ జ్యోతి 39 ఓట్ల మెజార్టీతో వైసిపి అభ్యర్థులపై గెలిచారని చెప్పారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీనాక్షి నాయుడును గెలిపించుకుంటామన్నారు. బసాపురం నాయకులు రామస్వామి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను నెరవేర్చామని ప్రగల్బాలు పలుకుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు బుద్ధారెడ్డి, బసవ, తిమ్మప్ప, మాబాష, సుబ్బు, అయ్యన్న, రామకృష్ణ ఉన్నారు.