Jun 24,2023 22:18

భవిష్యత్తుకు టిడిపి గ్యారెంటీ బస్సుయాత్రలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

       పుట్టపర్తి రూరల్‌ : వైసిపిని అధికారం నుంచి తరిమేస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని టిడిపి నాయకులు పునరుద్ఘాటించారు. టిడిపి 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో చేపట్టిన బస్సుయాత్ర శనివారం నాడు పుట్టపర్తి నియోజకవర్గంలోకి చేరింది. బడవాండ్లపల్లి, బాసంవారిపల్లి, అరవాండ్లపల్లి, చెర్లోపల్లి, వెంగలమ్మ చెరువు తదితర గ్రామాల్లో యాత్ర సాగింది. మాజీ మంత్రులు పల్లె రఘునాథ్‌ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యేలు పార్థసారథి, కంది కుంటా వెంకట ప్రసాద్‌, ఉన్నం హనుమంతరాయ చౌదరి, నాయకులు బిటి.నాయుడు, మాజీ ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, బచ్చల పుల్లయ్య, ఉమామహేశ్వర నాయుడు, పర్వీన్‌భాను, టీడీపీ బిసి సెల్‌ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, రంగయ్య, జెరిపిటి నరసింహులు, సామకోటి ఆదినారాయణ ,రవీంద్ర తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరజిన్నయ్యపల్లి, కర్నాటక నాగేపల్లి వద్ద టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు, కర్ణాటకనాగేపల్లి పుట్టపర్తి చిత్రావతి వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్‌, బుక్కపట్నం చెరువు కట్టపై పైలాన్‌ ఆవిష్కరణ శిలాఫలకంను చూపిస్తూ టిడిపి నాయకులు సెల్ఫీ దిగారు. టిడిపి హయాంలో జరిగిన అభివద్ధి పనులు, సిసి రోడ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా పైపులైన్‌ తదితర అభివద్ధి పనులకు బొగ్గలపల్లి వద్ద వేసిన శిలాఫలకాన్ని టిడిపి నాయకులు చూపిస్తూ వైసిపి నాయకులకు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలకు వెన్నుదన్ను టీడీపీ అన్నారు. రాష్ట్రంలో సైకో జగన్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ఏపీ ప్రజల భవిష్యత్‌కు చంద్రబాబు గ్యారెంటీగా నిలుస్తారని చెప్పారు. మెజార్టీ ప్రజలు టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకొంటున్నారని తెలిపారు. మహిళల రక్షణకు అండగా చంద్రబాబు పెద్దన్నయ్యగా నిలుస్తారని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలపై అన్ని రకాల భారాలు పడుతున్నాయన్నారు. టిడిపి మహానాడు వేదికగా భవిష్యత్‌కు గ్యారెంటీతో ఆరు హామీలను చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు. ఈ హామీలు ప్రజలకు భరోసాగా ఉంటాయన్నారు. చంద్రబాబు నాయుడు పూర్తి మేనిఫెస్టో ప్రకటిస్తే వైసీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందన్నారు. బస్సు యాత్రకు పుట్టపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల టిడిపి కన్వీనర్లు రామాంజనేయులు, విజయకుమార్‌, మల్లిరెడ్డి, శ్రీనివాసులు, రామకృష్ణ, మైలే శంకర్‌, జయచంద్ర, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.