ప్రజాశక్తి-కొండపి: రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని తరిమేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. మండలంలోని చినవెంకన్నపాలెం గ్రామంలో బాబు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టి ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారన్నారు. కొండపి నియోజకవర్గంలో వైసిపి అరాచకాలు ఎక్కువయ్యాయని, యువతకు ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రాక్షస పాలనకు ఓటు అనే ఆయుధంతో చరమగీతం పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొర్రెపాటి రామయ్యచౌదరి, బత్తుల నారాయణస్వామి, రాష్ట్ర నాయకులు వసంతరావు, మిట్టపాలెం నాయకులు ఐనంపూడి రమేష్, చిన్నవెంకన్నపాలెం టిడిపి నాయకులు, మహిళలు, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.










