పుట్టపర్తి అర్బన్ : వైసిపి నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాటిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు, ఎస్ పి మాధవరెడ్డికి మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టిడిపి ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ విన్నవించారు. ఈ మేరకు వారు కలెక్టర్‌ను, ఎస్‌పిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆ రెండు నియోజకవర్గాల పరిస్థితులు, వైసిపి నాయకుల తీరు గురించి వివరించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ఎస్ పి వారికి తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం మండలం తుమ్మల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పై వైసిపి నేత జెడ్పి వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి దాడికి పాల్పడ్డాడనిబాధితుడు ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు నామమాత్రం కేసు నమోదు చేశారని అన్నారు. బాధితునికి కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులకు బెయిల్ బుల్ సెక్షన్లు నమోదు చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. బియ్యం అక్రమ రవాణా, ఇసుక దందా, భూ ఆక్రమణల గురించి ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.










