ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్ : వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అర్హులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మండలంలోని కప్పల బండ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పల్లె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన గుర్రం సుబ్బమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి వెళ్లిన పల్లె రఘునాథరెడ్డి ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దీంతో సుబ్బమ్మ తనకు జరుగుతున్న అన్యాయాన్ని పల్లె దృష్టికి తీసుకువచ్చారు. అన్ని అర్హతలు ఉన్నా తనకు పింఛను రావటం లేదని వాపోయారు. గత టిడిపి ప్రభుత్వంలో తనకు పింఛను వచ్చేదని వివరించారు. వైసిపి ప్రభుత్వం రాగానే తనకు పింఛను నిలిపివేశారని వాపోయారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలన్నీ అందజేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ కు ఇది కానరాలేదా అని పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. మండల వ్యాప్తంగా 150 మందికి పైగా పింఛన్లు తొలగించారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ సమస్యలను తీరుతాయని బాధితులకు పల్లె హామీ ఇచ్చారు. ఈసందర్భంగా గ్రామంలోని బీసీ కాలనీలో నెలకొన్న సమస్యలను ఆకాలనీవాసులు పల్లె దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ విజరు కుమార్, నాయకులు సామకోటి ఆదినారాయణ, శ్రీరామిరెడ్డి, పుల్లప్ప, రత్నప్ప చౌదరి, అంబులెన్స్ రమేష్, ఉపేంద్ర, ఓబులేసు, మాజీ సర్పంచి చంద్రశేఖర్, బొమ్మయ్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొత్తచెరువు : కొత్త చెరువులోనే దర్గా కాలనీ, ఎస్సీ కాలనీలో టిడిపి నాయకులు శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా టిడిపి జిల్లా అధికారప్రతినిధి వలిపి శ్రీనివాసులు మాట్లాడుతూ దర్గా కాలనీ, ఎస్సీకాలనీల్లో డ్రయినేజీ లేకపోవడంతో మురుగునీరు రోడ్ల మీదనే ప్రవహిస్తోందన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయన్నారు. వైసిపి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మౌలా నరసింహులు, పెద్దన్న, ఇనయతుల్లా, సోహల్ తదితరులు పాల్గొన్నారు.










