Jun 22,2023 21:45

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచకాలు అక్రమాలు అన్యాయాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సు యాత్ర చేపడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పల్లె విలేకరులతో మాట్లాడుతూ 24న శనివారం భవిష్యత్తు గ్యారెంటీ బస్సుయాత్ర పుట్టపర్తి నియోజకవర్గంలోని బొగ్గలపల్లి నుంచి ప్రారంభమవుతుందన్నారు. అక్కడ నుంచి నల్లమాడ, వెంగళమ్మ చెరువు, పుట్టపర్తి మీదుగా బుక్కపట్నం నుంచి కొత్తచెరువుకు బస్సు యాత్ర చేరుకుంటుందన్నారు. అక్కడ బహిరంగ సభ సాయంత్రం ఉంటుందన్నారు. శనివారం రాత్రి పుట్టపర్తి లో బస చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. నల్లమాడ లో టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ యాత్రలో ప్రజలకు వివరిస్తామన్నారు. పుట్టపర్తి సమీపంలోని కర్నాటక నాగపల్లి వద్ద టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్లను చంద్రబాబు పరిశీలిస్తారన్నారు. అలాగే మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు ఈ యాత్రలో వివరిస్తారన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 15 వేలు పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న ఒక్కొక్కరికి ఏడాదికి చదువుకు రూ. 15 వేలు, ఇంటింటికి కులాయిలు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, బిసిల రక్షణ చట్టం తదితర పథకాలన్నీ ఈ యాత్రలో వివరించడం జరుగుతుందన్నారు. ఈ బస్సు యాత్రలో టిడిపి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు సామకోటి ఆదినారాయణ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రత్నప్ప చౌదరి, మాల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.