కళ్యాణదుర్గం : వైసీపీ పాలనలో రాష్ట్రంలో రైతాంగం సర్వనాశనం అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు విమర్శించారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం కళ్యాణదుర్గం శ్రీనివాస కళ్యాణమండపంలో 'రైతు సంక్షోభం-ప్రజావేదిక' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. టీడీపీ పాలనలో రైతులకు అందజేసిన సబ్సీడీ పథకాలు ప్రస్తుత సీఎం జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలనలో రైతుల కష్టాలపై చర్చించారు. ప్రస్తుత వ్యవసాయంలో పడుతున్న ఇబ్బందులను స్థానిక రైతులు చందబ్రాబుకు వివరించారు. గతంలో 10 ఎకరాలు ఉన్న ప్రతిరైతుకూ 90శాతం సబ్సీడీతో బిందు, తుంపర సేద్యం పరికరాలు విరివిగా అందాయని, ప్రస్తుతం ఇలాంటి పథకాలు లేవన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రతి ఏడాదీ పంటనష్టపరిహారంతో పాటు ఇన్‌పుట్‌సబ్సీడీ, ఇన్సూరెన్స్ తూచా తప్పకుండా అందేదన్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా అతివృష్టి, అనావృష్టి కారణంగా తాము సాగుచేసిన వేరుశనగ, కంది, టమోటా, మామిడి, బొప్పాయి, మిరప తదితర పంటలకు పరిహారం అందలేదని రైతులు చంద్రబాబు ఎదుటే ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన సాగులో ఏఒక్కస్కీం కూడా లేకుండా చేశారని ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ప్రస్తుత పాలనతో సంక్షేమ పథకాల ఊసే లేదని ఎర్రంపల్లి, పాలవాయి, ముద్దినాయనపల్లి, ముదిగల్లు, ఒంటిమిద్ది, ముప్పలకుంట తదితర గ్రామాల రైతులు వాపోయారు. అనంతపురం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జిల్లా నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్నప్పటికీ ఈ ప్రాంత రైతులు, ప్రజలను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వ పూర్తీగా విఫలమయ్యిందన్నారు. ఇప్పటికైనా రైతులు మేల్కొని దుర్మార్గపు పాలనను సాగనంపేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడుతో పాటు రైతులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










