Jun 21,2023 22:35

విలేకరులతో మాట్లాడుతున్న తులసి రెడ్డి

       ముదిగుబ్బ : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ బిల్లులు చూడగానే ప్రజలకు షాక్‌ కొట్టే పరిస్థితి ఏర్పడిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా ఛైర్మన్‌ తులసి రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ముదిగుబ్బలో విలేకరులతో మాట్లాడారు. గతంలో కరెంటు తీగ పట్టుకుంటే షాక్‌ కొట్టేదని, వైసిపి పాలనలో కరెంట్‌ బిల్లు చూడగానే షాక్‌ కొడుతోందని ఎద్దేవా చేశారు. వైసిపి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని, ఉన్నవి కూడా తగ్గిస్తామని జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వివిధ పేర్లతో ఎడాపెడా విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల్లో ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని తెలిపారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో రైతులు, ప్రజలపై భారాలు మోపడం తగదని, తక్షణం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసిపికి రివర్స్‌ షాక్‌ ఇస్తారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ధర్మవరం నియోజవర్గం నాయకులు నిషార్‌ అహ్మద్‌, మండల కన్వీనర్‌ బాసినేని ప్రభాకర్‌ నాయుడు, ఆదినారాయణ, నాగరాజు, నారాయణస్వామి, గోపాల్‌ నాయక్‌, శ్రీనివాసులు, అమర్‌, ఉత్తన్న, సుబ్బరాయుడు, వినరు పాల్గొన్నారు.