కనగానపల్లి : అధికార పార్టీ నేతలు బాహాబాహికి దిగారు. ఉపాధి డబ్బులు చెల్లింపు, పంపకాల విషయంలో వచ్చిన తేడాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఏకంగా ఎంపిడిఒ కార్యాలయంలోనే నేతలు చెప్పులతో దాడులు చేసుకున్నారు. సోమవారం ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి ఎంపిడిఒ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన అధికార పార్టీలో నేతల మధ్య ఉన్న అసమ్మతి మరోసారి బట్టబయలు అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... కనగానపల్లి మండలం కోనాపరం పంచాయతీకి సంబంధించి ఉపాధి హామీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సహకారంతో గ్రామ ఎంపీటీసీ వర్గం కలిసి ఉపాధి హామీ పనులు చేయకుండానే చేసినట్లు చూపి సుమారు రూ.పది లక్షలు బిల్లులు చేసుకున్నట్లు అదేగ్రామానికి చెందిన వైసిపి నేతలు వారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ డబ్బుల పంపకాలకు సంబంధించి గ్రామంలో ఓ వైసిపి నాయకుడు, ఎంపిటిసి వర్గంకు మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. రెండు రోజులు కిందట గ్రామంలో ఘర్షణ పడ్డారు. ఈ విషయం తెలిసి వైసీపీ మండల ప్రధాన నాయకుడు వారికి సర్ధిచెప్పి గొడవ పెద్దది కాకుండా సద్దుమణిగేలా చేశాడు. అప్పటికి మౌనంగా ఉన్న నేతలు సోమవారం నాడు మళ్లీ గొడవపడ్డారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వద్ద వైసీపీ ప్రధాన నాయకుని సమక్షంలో చర్చిస్తున్న సందర్భంలో కోనాపురం ఎంపీటీసీ వర్గం, అదే గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్ద్ అసిస్టెంట్ రెండు వర్గాలుగా విడిపోయి భౌతికదాడులు చేసుకున్నారు. మండల వైసీపీ ప్రధాన నాయకుడు, పోలీసులు సమక్షంలోనే ఎంపీడీవో కార్యాలయంలో ఏకంగా చెప్పులతో దాడులు చేసుకున్నారు. వీరి దాడులతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగుజేసుకుని ఇరవర్గాల వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపివేశారు. అక్రమంగా ఉపాధి బిల్లులు కాజేయడం కోసం అధికార పార్టీ నేతలు ఇలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఏమిటంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కాగ ఈ ఘటనపై ఆ పార్టీ ముఖ్యనేతలు ఎవరూ స్పందచలేదు.










