ప్రజాశక్తి-పాచిపెంట : ప్రస్తుత వైసిపి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రజల జీవనం దుర్భరంగా మారిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పాచిపెంట మండల కేంద్రంలో బుధవారం టిడిపి మండల అధ్యక్షులు ఎన్నింటి ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే యువత, మహిళలు, పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో టిడిపి మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచిందని వివరించారు. అనంతరం గ్రామంలో ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.పి.భంజ్‌దేవ్, నాయకులు పిన్నింటి ఈశ్వరరావు, ముఖి సూర్యనారాయణ, మంచాల పారమ్మ, యుగంధర్, గ్రామ సర్పంచ్ సంతోషిని, కార్యకర్తలు పాల్గొన్నారు.










