Aug 16,2023 21:32

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వని

ప్రజాశక్తి- మెంటాడ : వైసిపి అరాచక పాలనను అంతమొందించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని అన్నారు. బుదవారం చింతాడ వలసలో వైసిపికి చెందిన సుమారు 150 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ దరిద్రునికి ఆకలెక్కువ అన్నట్టు 151 సీట్లు వైసిపికి రాష్ట్ర ప్రజలు ఇస్తే జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యేను బెదిరించి లాక్కు పోయారని అన్నారు. మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ వైసిపి దోపిడీ ప్రభుత్వమన్నారు. కనిపించిన ప్రతి సెంటు భూమిని వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రక్షాళన కోసం జనసేనను గెలిపించాలని కోరారు. జయతి గ్రామం వద్ద పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళలతో మాట్లాడారు. ఈ సారి జగన్‌కు మాత్రం ఓటేయమని కూలీలు తెలిపారు.
150 కుటుంబాలు చేరిక : చింతాడవలసకు చెందిన విశ్రాంతి విఆర్‌ఒ చింత పైడితల్లి ఆధ్వర్యంలో వైసిపి నుంచి 140 కుటుంబాలు, టిడిపి నాయకుడు గేదెల చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో 10 కుటుంబాలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసిపి 1వ వార్డు మెంబరు నిమ్మాది సూర్యనారాయణ, 5వ వార్డు మెంబర్‌ బోను అప్పారావు, మాజీ వైస్‌ సర్పంచ్‌ పంట్ల సత్యం, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ బాలి సూర్యనారాయణ వైసిపి నుంచి జనసేనలో చేరారు. వీరితోపాటు సమీప గ్రామాల నుంచి పలు కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. జనసేన నాయకులు యశస్వని, పడాల అరుణ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన సిద్దాంతాలు నచ్చి వైసిపిని వీడి జనసేనలోకి వచ్చినట్లు విశ్రాంతి విఆర్‌ఒ చింత పైడితల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆధాడ మోహనరావు, మునకాల జగన్నాథం, త్రివేది, దుర్గ, చింత శ్రీనువాసరావు, ఏం దేవుడు బాబు, పొట్టా శేఖర్‌, మండల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.