Jun 01,2023 20:38

లబ్ధిదారులకు రైతు భరోసా చెక్కును అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌ తదితరులు

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా జమ
- 2,19,791 మంది రైతులకు రూ. 120.97 కోట్లు : కలెక్టర్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       వైఎస్సార్‌ రైతు భరోసా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం కింద 2,19,791 మంది రైతులకు రూ.120.97 కోట్లు నేరుగా జమ చేశామని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ వెల్లడించారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ పట్టనంలో బహిరంగ వేదిక నుంచి వరుసగా 5వ ఏడాది మొదటి విడతగా వైయస్సార్‌ రైతు భరోసా, పిఎం కిసాన్‌, మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద తొలివిడతగా 52.31 లక్షల మందికి రూ.3,934.25 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. నంద్యాల కలెక్టరేట్లోని వైయస్సార్‌ సెంటినరీ హాల్లో వర్చువల్‌ విధానం ద్వారా జిల్లా కలెక్టర్‌ మనజిర్‌ జిలాని సమూన్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ వంగాల భరత్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌ రావు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు ఈ కార్యమ్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 45,607 మంది రైతులకు రూ.25.08 కోట్లు, బనగానపల్లిలో 42,005 మందికి రూ. 23.11 కోట్లు, డోన్‌లో 36,429 మందికి రూ.20.04 కోట్లు, నందికొట్కూర్‌లో 29,543 మందికి రూ.16.24 కోట్లు, నంద్యాలలో 24,527 మందికి రూ.13.50 కోట్లు, పాణ్యంలో 14,456 మందికి రూ.7.95 కోట్లు, శ్రీశైలంలో 27,224 మందికి రూ.15.02 కోట్లు రైతు భరోసా మొత్తాలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ మాట్లాడుతూ పంట ఉత్పాదకత కోసం నాణ్యమైన వనరులను, సేవలను సకాలంలో సమకూర్చుకొని అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్లో వైయస్సార్‌ రైతు భరోసా మొత్తాలను రైతులకు అందిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు దారు రైతులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని తెలిపారు. భూముల పరిమాణంతో సంబంధం లేకుండా సమిష్టిగా సాగుభూమి కలిగి ఉన్న యజమాని రైతు కుటుంబాలకు సంవత్సరానికి 13,500 రూపాయల ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ తదితరుల చేతుల మీదుగా రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా చెక్కును అందచేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌ సెంటినరీ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాల స్టాళ్లను వారు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.