Jul 21,2023 19:07

రోడ్లపై మురుగు, వర్షపు నీరు చూపుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌ రోడ్లు బురదమయంగా మారి, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని సిపిఎం జిల్లా నాయకులు గోవిందు తెలిపారు. శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణ సమగ్రాభివృద్ధిని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ముగితిపేట, ఎన్‌టిఆర్‌ కాలనీ, శివన్న నగర్‌, వైఎస్‌ నగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు పలు సమస్యలను సిపిఎం నాయకుల దృష్టికి తెచ్చారు. అనంతరం సిపిఎం జిల్లా నాయకులు గోవిందు, నాయకులు రాముడు, కృష్ణ, లక్ష్మన్న, లక్ష్మీ నరసయ్య, అబ్దుల్లా, రాజు మాట్లాడారు. పాలకులు ఎన్నికల సందర్భంగా మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారని, తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగల తొక్కుతున్నారని విమర్శించారు. ఇప్పటికే దోమల వల్ల డెంగీ, మలేరియా జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపాలిటీకి నిధులు మంజూరైనప్పటికీ కమిషనర్‌ మాత్రం రోడ్లు వేయడాన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ కమిషనర్‌ జోక్యం చేసుకొని సిసి రోడ్లకు మరమ్మతులు చేయాలని, డ్రెయినేజీ నిర్మించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22, 23, 24న ఎమ్మిగనూరు పట్టణమంతా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు పోరాటాలకు ముందు రావాలని కోరారు.