'వైఎస్‌ఆర్ జలకళ' మాయ
- రైతుకు మంజూరయినా వేయని బోరు
- రికార్డుల్లో మాత్రం వేసినట్లు చూపుతున్న అధికారులు
ప్రజాశక్తి - బనగానపల్లె
రాష్ట్ర ప్రభుత్వం చిన్న, సన్న కారు రైతుల కోసం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్ జలకళ పథకం అమలులో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. బనగానపల్లె మండలంలోని పెద్దరాజుపాలెం గ్రామానికి చెందిన రైతు ఈడిగ రామ కొండయ్యకు వైఎస్‌ఆర్ జలకళ పథకం కింద మూడేళ్ల క్రితం బోరు మంజూరయింది. రైతు పొలంలో అధికారులు మాత్రం బోరు వేయలేదు. బోరు వేయాలని అధికారుల చుట్టూ రైతు తిరిగినా పట్టించుకోలేదు. చివరకు జిల్లా అధికారులను రైతు సంప్రదించగా అప్పటికే బోరు వేసినట్లు రికార్డులు చూపడంతో అయోమయంలో పడ్డాడు. వివరాలు... మండలంలోని పెద్దరాజుపాలెం గ్రామానికి చెందిన రైతు ఈడిగ రామ కొండయ్యకు సర్వే నెంబరు 37లో 2-75 ఎకరాల భూమి ఉంది. దీంతో వైయస్సార్ జలకళ కింద బోరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2020లో దరఖాస్తు నెంబర్ వైజెకె 13441133 ద్వారా బోరు మంజూరు అయింది. రైతు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా బోరు వేయలేదు. దీంతో జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోగా అప్పటికే బోరు వేసినట్లు స్టేటస్‌లో రావడంతో రైతు కంగు తిన్నాడు. రైతు రామ కొండయ్య ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో బోరు వేయించుకున్నట్లు అధికారుల రికార్డులలో నమోదయింది. బోరు వద్ద ఓ మహిళ ఫొటో దిగిన దృశ్యాలను అధికారులు రైతుకు చూపించారు. దీంతో రైతు తనకు బోరు వేయలేదని, తన పొలం పెద్దరాజుపాలెం గ్రామంలో ఉందని, ప్యాపిలి మండలం గార్లదిన్నెలో తనకు సంబంధంలేని మహిళ బోరు వేయించుకుంటే తనకేమి సంబంధమని అధికారులను ప్రశ్నించారు. అయితే అధికారులు మంజూరైన దరఖాస్తుదారుడి పేరు మీద ఇప్పటికే బోరు వేసామని, ఏమీ చేయలేమని పేర్కొనడంతో రైతు హతాశుడయ్యాడు. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి తనకు బోరు వేయించాలని రైతు రామ కొండయ్య కోరుతున్నాడు.










