వైద్యసిబ్బందిపై జెడ్పీటీసీ ఆగ్రహం
ప్రజాశక్తి-కోడూరు
కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారంనాడు స్థానిక వార్డ్ మెంబర్ తోట గోపి రాబిన్ వ్యాక్సిన్ వేయాలని కోరగా ఒక్కరి కోసం వ్యాక్సిన్ ఓపెన్ చేయబోమని వైద్య సిబ్బంది చెప్పారు. నలుగురు ఉంటేనే వేస్తామని చెప్పడంపై సదరు వార్డ్ మెంబర్ గోపి ఆగ్రహం వ్యక్తం చేసి కుక్క కాటుకి ఒకేసారి నలుగురు వస్తారా అంటూ ప్రశ్నించారు. కొద్దిసేపు అనంతరం వచ్చిన అతను ప్రజాప్రతినిధి చెప్పడంతో అప్పుడు వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని రాబిన్ వ్యాక్సిన్ వేయించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో గురువారం స్థానిక జడ్పిటిసి సభ్యులు యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, వైసీపీ మండల కన్వీనర్ పరిసే మాధవరావు, వార్డ్ మెంబర్‌లు వెన్న ప్రసాద్, తోట గోపీలు గురువారం కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్యాధికారి డాక్టర్ మౌనికతో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజాప్రతినిధులకు డాక్టర్ మౌనిక తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, పరిసే మాధవరావులు వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక ప్రజా ప్రతినిధి వస్తేనే వ్యాక్సిన్ వేయడం సరికాదన్నారు. సామాన్య ప్రజలు గురించి పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ముగ్గురు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులుకు ఫిర్యాదుచేశారు. ఇంకోసారి ఇలా జరిగితే సహించేది లేదని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలల్లో సిబ్బంది ఇలా ప్రవర్తిస్తుండటం దారుణమని ఖండించారు. వార్డ్ మెంబర్ తోట గోపి మాట్లాడుతూ రోగులు ప్రభుత్వ వైద్యశాలకు వస్తే వ్యాక్సిన్ లేదని చెప్పటం సరికాదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేశామన్నారు.










