Sep 04,2023 21:40

క్రిటికల్‌ కేర్‌సెంటర్‌కు శంకుస్థాపన చేస్తున్న ఎంపి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

          ప్రజాశక్తి-అనంతపురం   వైసిపి అధికారంలోకి వచ్చాక సిఎం జగన్‌ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తోందని ఎంపి తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద 50 పడకల సామర్థ్యంతో రూ.23.75 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవాడికి జబ్బు చేస్తే ముందుగా చూసేది ప్రభుత్వ ఆస్పత్రుల వైపే అన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా సిఎం జగన్‌ ఇప్పటికే నాడు-నేడు కింద రూ.300కోట్లతో సర్వజనాస్పత్రి విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్‌కు సంబంధించి స్థలాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక్కడ ఏడురకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, 500కుపైగా మేజర్‌, మైనర్‌ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు సర్వజనాస్పత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గతంలో వైద్య చికిత్సల కోసం కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌ వెళ్లే పరిస్థితి ఉండేదని, కానీ ఇక్కడ కూడా క్రిటికల్‌ కేసులకు చికిత్స అందుతోందన్నారు. ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తాజాగా శంకుస్థాపన చేసిన క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ను ఎనిమిది నెలల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, ఇతర వైద్యులతో సమావేశమయ్యారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం వద్దని ఎమ్మెల్యే అనంత సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దష్టికి తీసుకురావాలని, అందరూ సమిష్టిగా పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కెఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీదేవి, ఆర్‌ఎంఒ పద్మజ, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ సుబ్రమణ్యం, అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సౌజన్యకుమార్‌, ఎపిఎంఎస్‌ఐడిసి ఇఇ మహబూబ్‌, డిఇ శ్రీనివాసులునాయుడు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ మంజు, గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ రజని, కార్పొరేటర్‌ సంపంగి రామాంజినేయులు, వైసిపి మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి పాల్గొన్నారు.