Jul 03,2023 20:54

శాకాంబరీ అలంకరణలో భ్రమరాంబ దేవి అమ్మవారు

వైభవంగా శాకాంబరీ ఉత్సవం
ప్రజాశక్తి - శ్రీశైలం

       ఆశాడ పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ దేవి అమ్మవారికి సోమవారం శాకాంబరీ ఉత్సవాన్ని దేవస్థానం వారు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పండ్లు, ఆకుకూరలతో అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని అంతా పండ్లు, ఆకుకూరలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారికి, అన్నపూర్ణాదేవి అమ్మవారికి, గ్రామదేవత అంకాలమ్మకు వివిధ రకాల పండ్లు, ఆకుకూరలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు వేద పండితులు పాల్గొన్నారు. శాకాంబరీ ఉత్సవం సందర్భంగా క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర క్యూలైన్‌లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. క్యూలైన్లో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు దేవస్థానం వారు చేశారు.
శ్రీశైలంలో గురు పౌర్ణమి : గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీశైలం దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్క మహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ మందిరంల వద్ద, దక్షిణామూర్తి స్వామి వారికి, వ్యాస మహర్షికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ లవన్న మాట్లాడుతూ ఒకే వేదంగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి రచించి ప్రజలకు తెలియజేసిన ఘనత వ్యాస మహర్షికే దక్కిందని అన్నారు.
గో సంరక్షణ నిధికి విరాళం : గోవులను సంరక్షించేందుకు దేవస్థానం ఏర్పాటు చేసిన గో సంరక్షణ నిధికి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నివాసులైన సత్యాలు జోష్ణ రూ.1,00,111 విరాళంగా దేవస్థానానికి అందజేశారు. దాతలకు స్వామి వారి శేష వస్త్రాలను, ప్రసాదాలను దేవస్థానం అధికారులు అందజేశారు.