న్యూఢిల్లీ : వివాదాస్పదంగా మారిన ప్రైవసీ పాలసీని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్, భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆందోళనలు కొంత కాలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వినియోగదారులు ఈ పాలసీని అంగీకరించాలని ఒత్తిడి చేయబోమని కూడా పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వం ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేయమని చెప్పిందని, డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చేవరకు తాము దీన్ని అమలు చేయమని, ఒకవేళ బిల్లు దీన్ని అనుమతిస్తే.. అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. వాట్సాప్ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కేంద్రం భావిస్తోందని తెలిపారు.
నిజానికి వాట్సాప్ కొత్త పాలసీ ఫిబ్రవరిలోనే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, వివిధ వర్గాల నుంచి వెల్లడైన ఆందోళనల నేపథ్యంలో వాయిదాపడి, మే 15కి అమల్లోకి వచ్చింది. అయితే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మేలో కేంద్రం రాసిన లేఖపై కొద్ది రోజుల తర్వాత వాట్సాప్ స్పందించింది. వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. కాగా, కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకువచ్చిన ఐటీ నిబంధనలే కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదానికి దారితీశాయి. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలు పూర్తిగా అమలు చేస్తే వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతుందని, అందుకు తాము సిద్ధంగా లేమని చెప్తూ వాట్సాప్ కోర్టును ఆశ్రయించింది.










