
కథలోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కృష్ణ రంగస్వామి (సిద్ధార్థ్) తల్లి, చెల్లితో కలిసి నివసిస్తాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను తీసుకుంటాడు. తన అర్హతకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో 'ఎస్కేప్ లైవ్' అనే వీడియో షేరింగ్ యాప్‌లో మోడరేటర్‌గా జాయిన్ అవుతాడు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం దృష్ట్యా కృష్ణ సంప్రదాయాలకు, భారత దేశ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటాడు. తాను మానిటర్ చేసిన 'ఎస్కేప్ లైవ్'లో ఒక అశ్లీల వీడియోను బ్యాన్ చేయాలని చూడడంతో పెద్ద రచ్చ జరుగుతుంది. సిరీస్ మొత్తం మీద కృష్ణ ఒక పాత్ర మాత్రమే కాగా కృష్ణతోపాటు మరికొన్ని పాత్రల కథలు సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కథలన్నిటికీ 'ఎస్కేప్ యాప్' కనెక్టింగ్ పాయింట్. ఇదిలా ఉండగా.. ఎస్కేప్ లైవ్ యాప్ తన పాపులారిటీ పెంచుకునేందుకు ఒక కాంటెస్ట్ నిర్వహిస్తుంది. యాప్ యూజర్స్ వివిధ రకాల వీడియోలు చేసి, అప్‌లోడ్ చేస్తే వారికి డైమండ్స్ వస్తాయి. అవి క్యాష్ రూపంలో ఒక డేట్ వరకూ వారి అకౌంట్‌కు చేరతాయి. ఎక్కువ డైమండ్స్ గెలుచుకున్న వారికి రూ.3 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు నిర్వాహకులు. హీనా (ప్లబితా బార్దాకర్), డార్కీ (సుమేధ్ ముద్గాల్కర్), డాన్స్ కీ రాణి (ఆద్యా శర్మ), స్పైడీ (రిత్విక్ షోరే), రాజ్ కుమార్ (రోహిత్ చందేల్) వంటి వారు 3 కోట్ల బహుమతి కోసం పోరాడతారు. వీరు డబ్బు కోసం ఎంతకు తెగించారు? యాప్ కాన్సెప్ట్ నచ్చని కృష్ణ ఏం చేశాడు? కృష్ణ ఎదురైన పరిస్థితులు ఎంటీ? ఐదుగురు కంటెస్టెంట్‌లు చివరికి ఏమయ్యారు? రూ.3 కోట్లు ఎవరు గెలుచుకున్నారు? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సిరీస్ చూడాల్సిందే.
పేరుకు ఇది సిరీస్ అయినా, మనం నిత్యజీవితంలో చూసేదే. మొన్నామధ్య మన దేశంలో బ్యాన్ అయిన టిక్ టాక్ లాంటి యాప్స్ యూత్‌ను, పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ సిద్ధార్థ్‌కుమార్ తివారీ. ప్రాంక్ పేరుతో సోషల్ మీడియాలో మనీ, ఫేమ్ కోసం యువత ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది? వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. వయసుకు మించిన డాన్స్‌లు, వీడియోల కోసం ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు, డబ్బు కోసం అసభ్యకర లైవ్‌లు ఇలా ప్రతి అంశాన్నీ స్పృశిస్తూ ఆయన అనుకున్నది ప్రేక్షకులకు చూపించడంలో విజయం సాధించారు. ఓ రకంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. సిరీస్‌లోని ఐదు ప్రధాన పాత్రలు, వారి నేపథ్యాన్ని చూపిస్తూ ప్రారంభించారు. అది కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. కానీ కథ పరంగా అలా చూపించడం తప్పదు. ఇక ఎస్కేప్ లైవ్ యాప్ కాంటెస్ట్ కోసం ఐదుగురు చేసే ప్రయత్నాలు, వారి జీవిత కథలు ఆకట్టుకుంటాయి. యాప్ ఎదుగుదల కోసం కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయనే విషయాలు బాగా చూపించారు. సిరీస్‌లో అక్కడక్కడా వచ్చే అశ్లీల సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అవి రియల్ లైఫ్‌లో జరిగే సంఘటనలని ఒప్పుకోక తప్పదు. నైతికత విలువలతోపాటు జెండర్ వివక్షను చూపించారు. సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అయితే మిగతా ఐదు ప్రధాన పాత్రలతో పోల్చుకుంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ డెప్త్ తక్కువ. ఇక మిగతా క్యారెక్టర్లు బేబీ ఆద్య శర్మ, ప్లబితా, రిత్విక్ సాహోర్, రాజ్‌కుమార్ రోహిత్ చందేల్ నటన అద్భుతంగా ఉంది. మిగతా నటీనటులు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జయ మిశ్రా -సిద్ధార్థ్ కుమార్ తివారీ రాసిన ఎస్కేప్ లైవ్ చాలా వరకూ నిజం అనిపించే కథ. రణ్వీర్ ప్రతాప్‌సింగ్ డైలాగ్స్ బాగున్నాయి. సతీష్ వెంకట రమణ కెమేరా పనితనానికి ఔరా అనాల్సిందే. చందన ఆరోరా ఎడిటింగ్‌పై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సింది. ఫైనల్‌గా సిరీస్ గురించి చెప్పాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోనైన సరే కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చివరి ఎపిసోడ్‌లో కొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా రెండో సీజన్ కూడా వస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
వెబ్ సిరీస్ : ఎస్కేప్ లైవ్ (హిందీ వెబ్ సిరీస్)
నటీనటులు: సిద్ధార్థ్, ఆకాంక్ష సింగ్, సుమేధ్ ముద్గాల్కర్, రిత్విక్ సాహోర్, ఆద్య శర్మ, ప్లబితా, రోహిత్ చందేల్, జావేద్ జాఫెరి, స్వస్తికా ముఖర్జీ, శ్వేతా త్రిపాఠి, వాలుస్చా డి సౌజా తదితరులు
దర్శకత్వం: సిద్ధార్థ్ కుమార్ తివారీ. మొత్తం ఎపిసోడ్స్ : 9 - మే 20 (7 ఎపిసోడ్స్), మే 27 (2 ఎపిసోడ్స్) ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్