అనరతపురం ప్రతినిధి : వార్షిక విత్తన ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఈ జిల్లాకు ఎంత విత్తనాలు అవసరమన్నది అంచనా వేసింది. ఈ మేరకు ఆయా సీజన్‌లో విత్తన కేటాయింపులను ఖరారు చేసింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ప్రధానమైన పంట వేరుశనగ. ఈ పంటకు సంబంధించి కూడా రెండు జిల్లాలకు విత్తన కేటాయింపులను ఖరారు చేసింది.
విత్తన కేటాయింపులకు సంబంధించి అనంతపురం జిల్లాకు 78,245 క్వింటాళ్లు కేటాయించగా, సత్యసాయి జిల్లాకు 100907 క్వింటాళ్లు కేటాయించింది. రెండు జిల్లాలకు కలిపి 1,79,152 క్వింటాళ్లు కేటాయించింది. గతేడాది కూడా ఇదే రకమైన కేటాయింపులు జరిగాయి. అయితే ఈ విత్తనకాయలు కూడా తీసుకోవడానికి రైతులు ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే ఈ విత్తన సేకరణకు సంబంధించి ఇప్పటి వరకు సేకరణ ధర ఖరారవలేదు. సేకరణ ధర ఖరారు తరువాత సబ్సిడీ ధర ఎంతన్నది తేలే అవకాశముంది. సాధారణంగా జిల్లాలో మే నెలలో ఖరీఫ్ వేరుశనగ విత్తన కాయa పంపిణీ ప్రారంభమవుతుంది. అంతలోపు అంటే ఈ నెలాఖరులోపు విత్తన సేకరణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. వేరుశనగతోపాటు వరి 1500 క్వింటాళ్లు, కందులు 4300 క్వింటాళ్లు, ఉలవలు 825 క్వింటాళ్లు, పిల్లిపెసర, అలసందలు, ఇతరములన్నీ కలిపి అనంతపురం జిల్లాకు ఖరీఫ్‌కు 85,322 క్వింటాళ్లు కేటాయించింది. ఇక సత్యసాయి జిల్లాకు వంద క్వింటాళ్ల కందులు, 50 క్వింటాళ్లు రాగి ఇతరములన్నీ కలిపి 1,01,141 క్వింటాళ్లు కేటాయించారు.
రబీ కేటాయింపులు ఇలా...
రబీ సీజన్‌కు ఇప్పుడే విత్తన కేటాయింపులు ఖరారు చేశారు. అనంతపురం జిల్లాలో రబీలో 24,700 క్వింటాళ్లు పప్పుశనగ, 200 క్వింటాళ్లు ఉలవలు, 6,799 క్వింటాళ్లు వేరుశనగ, ఇతర పంటలన్నీ కలిపి 31,736 క్వింటాళ్లు రబీకి కేటాయించారు. 500 క్వింటాళ్లు వరి, 1350 క్వింటాళ్లు పప్పుశనగ, 8223 క్వింటాళ్లు వేరుశనగ, మొత్తం 10,083 క్వింటాళ్లు సబ్సిడీ విత్తన కేటాయింపులు రబీకి చేశారు. వీటిని అక్టోబరు మాసం తరువాత పంపిణీ చేస్తారు.
మన విత్తనం లేనట్టేనా ?
ప్రభుత్వం సబ్సిడీతో పంపిణీ చేసే వేరుశనగ విత్తనకాయలు బయట వ్యాపారుల నుంచి సేకరిస్తుండటతో నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. ట్రూత్‌ఫుల్ లేబుల్డ్ సీడ్ విత్తనం పేరుతో సరిగాలేనివి కూడా పంపిణీ చేసినట్టు గతంలో విజిలెన్సు ఇతర శాఖల విచారణలోనూ తేలింది. దీంతో నాణ్యతమైన విత్తనం కనీసం 25 శాతమైనా ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో మన విత్తనం...సొంత విత్తనం పేరుతో రబీలో కొంత మంది రైతులకు విత్తనకాయలను అందజేసి ఖరీఫ్‌లో దాన్ని సేకరించి ఇవ్వాలని నిర్ధేశించడం జరిగింది. ఇందుకు అనుగుణంగా ఎపి సీడ్స్ శాఖకు బాధ్యతలు అప్పగించేవారు. ఆ శాఖ సర్టిఫైడ్ సీడ్‌ను రైతుల ద్వారా పండించి ఖరీఫ్‌లో వారి నుంచి సేకరించి విత్తనకాయలుగా పంపిణీ చేసేవారు. కాని ఈ ఏడాది రబీలో అటువంటి ప్రక్రియ ఏదీ జిల్లాలో జరగలేదు. దీంతో మొత్తం విత్తనకాయలను ప్రయివేటు వ్యాపారుల నుంచే కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైతులు నాణ్యమైన విత్తనం దొరక్క ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం పూర్తిగా సర్టిఫైడ్ సీడ్‌నే సేకరించే పరిస్థితి లేకుండా మొత్తం ట్రూత్‌పుల్ లేబుల్డ్ పేరుతో దొరికిన విత్తనాన్ని రైతులకు అంటగట్టే పరిస్థితి ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.










