Apr 25,2023 22:30

matladutunna collector p.rajababu

వారంలో నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)


వారంలో నాలుగు రోజులు పాటు జిల్లాస్థాయి నుండి సచివాలయ ఉద్యోగి వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ కలెక్టరేట్‌ నుండి వివిధ శాఖల జిల్లా, మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి గృహనిర్మాణం, రీసర్వే, స్పందన గ్రీవెన్స్‌, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా గృహనిర్మాణం, రీసర్వే వంటి ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు నిర్దేశించిన లక్ష్యాలు నూరుశాతం సాధించటానికి సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రీసర్వే, గృహ నిర్మాణం, రెవెన్యూకు సంబంధించి స్పందన గ్రీవెన్స్‌, జగనన్నకు చెబుదాం, వేసవిలో తాగునీటి సరఫరా తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు నూరుశాతం సాధించాలన్నారు. ప్రతి కార్యక్రమానికి సంబంధిత అధికారులు సమన్వయంతో లక్ష్యాలు సాధించాలన్నారు. కలెక్టర్‌ నుండి సచివాలయ ఉద్యోగి వరకు అధికారులు వారంలో నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా జరపాలని, ఫోటోలు తీసి అప్లోడ్‌ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ సంబంధిత సేవలకు సంబంధించి మ్యుటేషన్స్‌, కరెక్టన్స్‌, ఆదాయ, కుల, జనన ధృవపత్రాలు జారీ విషయంలో ఎక్కడా ఫిర్యాదులు రాకూడదన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలకు సంబంధించిన గ్రీవెన్స్‌ నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా పరిష్క రించాలని, గడువుదాటినవి పెండింగ్‌ రేపటిలోగా క్లియర్‌ చేయాలన్నారు. ఇకపై గడువు దాటినవి పెండింగ్‌ ఉంటే చార్జి మెమోలు జారీచేస్తామన్నారు. అధికారులు మనస్సు పెట్టి ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ తయారుచేయాలన్నారు. తాగునీటి పథకాలు తనిఖీలు నిర్వహించి సమస్యలు గుర్తించి రిపోర్ట్‌ చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. రీసర్వేలో భాగంగా సర్వే పనులు, సరిహద్దు రాళ్లు ఏర్పాటు అంశంలో నూరుశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. రోవర్స్‌ అన్ని పనిచేసేలా చూడాలన్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే రిపోర్ట్‌ చేసి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యశాఖకు సంబంధించి ఫిష్‌ రిటైల్‌ అవుట్లెట్స్‌ ఏర్పాటు అంశం కలెక్టర్‌ సమీక్షిస్తూ మత్స్యకారులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో రిటైల్‌ అవుట్లెట్స్‌ ఎక్కువగా ఏర్పాటు చేసుకొనేలా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే మత్స్యశాఖ హెచీఓడీ దష్టికి తీసుకువెళ్లాలన్నారు. గృహ నిర్మాణ ప్రగతి కలెక్టర్‌ సమీక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3.75 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యానికి (ఉగాది లక్ష్యం) అనుగుణంగా జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 14,895 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి దాకా 14,340 పూర్తి చేసి 96.27 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. బిలో బేస్మెంట్‌ లెవెల్‌ స్థాయిలో ఉన్న గృహాలు బేస్మెంట్‌ లెవెల్‌ స్థాయికి తీసుకెళ్లటానికి కృషి చేయాలన్నారు. గృహనిర్మాణ లబ్దిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు చేసిన మొత్తాలు నిర్మాణానికే వినియోగించేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు, భూ ఆక్రమణలు జరిగినట్లు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలన్నారు. కళాశాలలు, పాఠశాలలు తరచూ సందర్శించాలని డీఈఓకు సూచించారు. ఎనీమిక్‌ కిశోర బాలికల్లో అనీమియా నివారించేందుకు ఈనెల 28న ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, గృహనిర్మాణ శాఖ పీడీ జివి. సూర్యనారాయణ, కేఆర్‌ ఆర్‌ సీ డిప్యూటీ కలెక్ట బి. శివనారాయణ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ ట్రైనీ చైతన్య, సీపీఓ వై. శ్రీలత, డిఈఓ తహేరా సుల్తానా, డిఎంఅండ్‌ హెచ్‌ ఓ డా. గీతాబాయి, డిఆర్డిఎ పీడీ పిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.