వాణిజ్యానికీ భారం
- భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులు
- ట్రూఅప్, ఎఫ్‌పిపిసిఎ రూపంలో బాదుడు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వాణిజ్య కనెక్షన్లకు కూడా విద్యుత్ బిల్ భారీగా పెరిగింది. ట్రూఅప్, ఎఫ్‌పిపిసిఎ పేరుతో ప్రభుత్వం అదనపు బాదుడు వేయడమే అందుకు ప్రధాన కారణం. దీంతో దుకాణదారులపై తీవ్ర భారం పడింది...
సామాన్యులతో పాటు దుకాణదారులు కూడా ఈ నెలలో విద్యుత్ బిల్లులు ముట్టుకోవాలంటేనే షాక్ కొడుతోంది. గత ఏడాది ఆగష్టు నుంచే తొలి విడత ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేస్తుండగా ఈ నెల నుంచి రెండో విడత ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేస్తుండటంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1,25,378 వాణిజ్య విద్యుత్ కనెక్షన్లు(ఎల్‌టి2) ఉన్నాయి. ఆ కనెక్షన్ల వినియోగదారులందరూ కలిసి మే నెలలో 1.95 లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు వాడుకున్న విద్యుత్ వినియోగాన్ని 18 ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా తీసి ట్రూ అప్ చార్జీలు యూనిట్‌కు అప్పట్లో వినియోగించిన యూనిట్‌కు ఏడు పైసల చొప్పున వసూలు చేస్తున్నారని విద్యుత్ శాఖ చెబుతోంది. 2021-2022 సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్‌లో వాడుకున్న వినియోగానికి సంబంధించి అప్పట్లో వాడుకున్న వినియోగానికి యూనిట్‌కు 23 పైసలు చొప్పున ట్రూఅప్ భారం విధించారు. ఆ నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు జూన్ నెలలో వచ్చింది. అందులో సామాన్యులపై పెంపు భారం పడింది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాణిజ్య వినియోగదారులందరి మీద ఒక్క నెలలోనే రూ.45 లక్షల మేర ట్రూ అప్ భారం పడింది. మరో వైపు ప్యూయల్ అండ్ పవర్ పర్చేజి కాస్ట్ అడ్జస్ట్‌మెంట్(ఎఫ్‌పిపిసిఎ) రూపంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై తీవ్ర భారం మోపింది. 2023 ఏప్రిల్‌లో వినియోగించుకున్న వినియోగానికి యూనిట్‌కు 40 పైసలు చొప్పునకింద అదనపు చార్జీలు జూన్‌లో వసూలు చేస్తున్నారు. ఇవి విద్యుత్ వినియోగదారుడికి అదనపు భారంగా మారింది. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాణిజ్య వినియోగదారులపై ఎఫ్‌పిసిసిఎ రూపంలో ఈ ఒక్క నెలలోనే రూ.1.93 కోట్ల మేర భారం పడింది. వినియోగదారులపై ట్రూఅప్‌తో పాటు ఎఫ్‌పిసిసిఎ రూపాల్లో భారం వేయడంతో యూనిట్‌కు 63 పైసల చొప్పున భారం పడింది.
ఎలా కట్టాలి..?
నేను పంచర్ దుకాణం నిర్వహిస్తున్నాను. ప్రతి నెల రూ.600 వరకూ కరెంట్ బిల్ వస్తుంది. గత నెలలో వ్యాపారం సరిగా లేక దుకాణం తెరవలేదు. అయినా రూ.831 కరెంట్ బిల్ వచ్చింది. వ్యాపారమే సరిగ్గా లేకపోతే అంతంత కరెంట్ బిల్ వస్తే ఎలా కట్టాలి?
- హర్షిత్, పంచర్ దుకాణం నిర్వాహకుడు, హొళగుంద.










