Mar 27,2022 13:08

టీవీ ప్రకటనలు
డా. వేంపల్లె షరీఫ్‌,
పేజీలు: 276, వెల: 260/
ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు
ఫోన్‌: 96034 29366
తమ పూర్తి చిరునామాను తెలియజేస్తూ
ఇదే నంబరు గూగుల్‌/ఫోన్‌ పే
చేసిన స్క్రీన్‌ షాట్లను పంపి కూడా తెప్పించుకోవచ్చు.


ప్రసార సాధనాలు, ప్రకటనలు రెండూ పరస్పర పూరకాలు. జర్నలిజంలో ప్రసారసాధనాల పనితీరు గురించి వివరిస్తారు కానీ, ప్రకటనల గురించి పెద్దగా దృష్టిపెట్టరు. అయితే ఈ ప్రకటనల చుట్టూ పెద్ద ఉపాధిరంగమే ఉంది. ఓవైపు ప్రపంచీకరణ, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ విధానాలు ప్రాంతీయ ప్రసార, ప్రచార మాధ్యమాలను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. లాభాపేక్షే ధ్యేయంగా వీలైనన్ని ఆకర్షణలు, హంగులతో చేతనైనన్ని కళా ప్రదర్శనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అయితే జర్నలిజంలో పొసగలేని చాలామంది ప్రకటనల రంగంలో రాణించి గొప్ప క్రియేటివ్‌ పర్సన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తెలుగులో టీవీ ప్రకటనల్లో ఇంత శాస్త్రీయమైన చర్చ ఇంతవరకూ జరగలేదు. చూడలేదు. అయితే జర్నలిస్టుగా, కథకుడిగా... ముఖ్యంగా రాయలసీమ మాండలికంలో కథారచన చేసిన వారిలో ఒకరిగా వేంపల్లె షరీఫ్‌కి మంచి గుర్తింపు ఉంది. షరీఫ్‌ ఇప్పుడు కొత్తకలంలో సరికొత్త సిరా నింపుకుని వాణిజ్య ప్రకటనలపై చేసిన కృషి అభినందనీయం. ఒక వస్తువును తయారీదారు నుంచి వినియోగదారు లేదా కొనుగోలుదారు వరకూ తీసుకురావడంలో కీలకపాత్ర పోషించేది వాణిజ్య ప్రకటనలేననడంలో అతిశయోక్తి లేదు.
    ముఖ్యంగా ఆధునిక యుగంలో ప్రకటనల రంగం అత్యద్భుతంగా రాణిస్తోంది. ఒక మామూలు వ్యక్తి నుంచి ధనవంతుల వరకూ అందరినీ అలరించి ఆకట్టుకునేవి వాణిజ్య ప్రకటనలే. అయితే ప్రకటనలకు కొనుగోలుదారుని ఆకట్టుకోవడమనే ప్రధాన బాధ్యతతో పాటు మరో బాధ్యత కూడా ఉంటుంది. అదే ప్రజల్లో మార్పు తేవడం. నేరుగా ప్రజల్లో మార్పును లేదా ప్రభావాన్ని తప్పనిసరిగా కోరుకుంటూ రూపొందేవే ప్రకటనలు. అప్పటికే ఒక వస్తువుకు అలవాటుపడ్డ వినియోగదారునితో దాన్ని మార్పించి, మరో కొత్త వస్తువుకు అలవాటు చేయాలి. అంటే కొత్త పద్ధతులను, అలవాట్లను, సంస్కృతిని పరిచయం చేసే ఉద్దేశంతో పనిచేస్తాయి ప్రకటనలు. అయితే ఇంతటి ప్రాధాన్యం గల రంగంపై తెలుగులో ఇంతవరకూ సరైన పరిశోధనలు జరగలేదన్న లోటును తన పరిశోధనాత్మక రచనతో పూరించే ప్రయత్నం చేశారు షరీఫ్‌. జర్నలిస్టులు, ప్రజా సంబంధాల విభాగం వారు, తెలుగు పరిశోధక విద్యార్థులతో పాటు ప్రకటనల రంగంలో రాణించాలనుకునే వారికి ఎంతగానో ఉపకరించేలా తన పరిశోధనతో కూడిన పుస్తకాన్ని రూపొందించగలగడం అభినందనీయం. పుస్తకం ముందుమాటలో స్వయంగా రచయిత చెప్పుకున్నట్టు ఇది పరిపూర్ణం కాదు కానీ ఇంచుమించు ప్రకటనలకు సంబందించిన సమగ్ర సమాచారం ఇందులో ఉందని చెప్పొచ్చు.