Aug 09,2023 20:45

సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
వాలంటీర్‌ సహాయం లేకుండా ఇంటింటి సర్వే, ఓటరు జాబితా సవరణ చేపట్టాలని సబ్‌ కలెక్టర్‌, ఆదోని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో ప్రత్యేక ఓటర్ల సవరణపై బూత్‌ లెవెల్‌ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎటువంటి లోపాలకు తావివ్వకుండా 2024 తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించిన ఏవిధమైన పనుల్లోనూ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఎఈఆర్‌ఒలకు సూచించారు. ఎఈఆర్‌ఒలు వారి సంబంధిత బూత్‌ స్థాయి అధికారులకు ఇంటింటి సర్వే, స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌- 2024కి సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. ఇంటింటి ఓటర్ల పరిశీలన చేస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి అపోహలూ ఉండకుండా, అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వారు బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోమని సూచించాలని తెలిపారు. అలాగే బూత్‌ స్థాయి ఏజెంట్లను ఎంపిక చేసి జాబితాను ఎన్నికల అధికారి కార్యాలయానికి సమర్పించాలన్నారు. సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లోని మరణించిన వారి జాబితాను మరణ ధ్రువీకరణ పత్రం లేదా పంచనామ ద్వారా ధ్రువీకరించి, పరిశీలించిన తర్వాతే ఓటరు జాబితా నుంచి తీసివేయాలన్నారు. ఒకే ఇంట్లో ఎక్కువ మొత్తంలో ఓటర్లు ఉంటే ఆ ఇంటిని పరిశీలించి, ఆ ఇంట్లో ఎక్కువ మంది వేర్వేరుగా నివాసాలు ఉంటే ఎన్నికల ప్రధాన అధికారి వారి ఆదేశాల మేరకు వారికొక పద్ధతి ప్రకారం ఇంటి నెంబరు ఇవ్వాలన్నారు. ఒక ఇంటి నెంబర్‌లో ఉన్న ఓటర్లనందరినీ ఒకే పోలింగ్‌ బూత్‌లో చేర్చాలని తెలిపారు. తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ, డిప్యూటీ ఇంజినీర్‌ రాజు నాయక్‌ ఉన్నారు.