ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్:ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ అరుణ్‌బాబు, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు విజయవాడ నుంచి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని పర్చువల్ విధానంలో నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 8263 మందికి సేవమిత్ర, 193 మందికి సేవారత్న, 34 మంది సేవ వజ్ర కింద ఎన్నికయ్యారని చెప్పారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా సేవలు అందిస్తున్న వాలంటీర్ల సేవలు గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకంగా అవార్డులు అందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆశయ సాధనకు వాలంటర్లు చేస్తున్న సేవలు గొప్పవన్నారు. వరుసగా మూడోసారి అవార్డులు ప్రధానం చేయడం సంతోషకరమన్నారు. వాలంటీర్లు అవార్డులు అందుకుని మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం సేవా వజ్రకు ఎంపికైన వాలంటీర్లు 34 మందికి సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు ఒక్కొక్కరికి 30 వేల రూపాయలు అందజేశారు. సేవారత్న కింద జిల్లాలో ఎంపికైన 193 మందికి సర్టిఫికెట్, శాలువా, మెడల్‌తో పాటు 20 వేల రూపాయలు, సేవా మిత్ర కింద ఎంపికైన వారికి 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు, సచివాలయాల కోఆర్డినేటర్ హిమవాణి, ఆయా శాఖల అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










