May 23,2023 22:20

పెనుకొండలో వాలెంటీర్ల సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - తనకల్లు : ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్ల సేవలు అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పివి. సిద్ధారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌ వద్దగల పోలం సిద్ధారెడ్డి ఫంక్షన్‌ హాల్‌ నందు మంగళవారం ఉత్తమ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి రెండు వేల కుటుంబాలకు ఒక సచివాలయాన్ని, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించి ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకు చేర్చారన్నారు. ఈ వ్యవస్థలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పెన్షన్‌ నుండి దాదాపు 33 రకాలైన సంక్షేమ కార్యక్రమాలను అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరవేయడంలో వాలంటీర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నారన్నారు. వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా వాలంటీర్ల సేవలకు సేవ వజ్రా, సేవా రత్న మరియు సేవమిత్ర అవార్డులతో సత్కరిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సులభతరంగా ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లు ముందుండి వారి సేవలు ప్రజలకు అందజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూల నరసింహులు, ఎంపీపీ కౌసల్య, వైసిపి మండల నాయకుడు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, మండల కన్వీనర్‌ మధుసూదన్‌ రెడ్డి, రామ్‌ దేశారు, బిఎస్‌ నిజాం హేమ శేఖర్‌ రెడ్డి మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమావేశం భవనంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, వివక్షకు తావు లేకుండా సేవలు అందిస్తున్న వాలంటీర్ల సేవలు గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకంగా వాలంటీర్ల కు సేవమిత్ర, సేవారత్న, సేవ వజ్ర కింద అవార్డులు అందిస్తోందని తెలిపారు. అనంతరం వాలంటీర్లను ఎమ్మెల్యే సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివ శంకరప్ప, ఎంపీపీ గీతా రామ్మోహన్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ రామాంజినేయులు, వైసిపి మండల కన్వీనర్‌ బాబు, సచివాలయం కన్వీనర్‌ శ్యామ్‌ నాయక్‌, నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి,మునిమడుగు శ్రీనివాసులు, కొండల రాయుడు, చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు.