Aug 24,2023 20:52

సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్మన్‌ శాంత

ప్రజాశక్తి - ఆదోని
మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం గురువారం వాడీవేడిగా సాగింది. రెండు నెలలుగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, సమస్య ఎందుకు వచ్చిందని ఛైర్మన్‌ బోయ శాంతతో పాటు కౌన్సిలర్లు ఫయాజ్‌, ఇంతియాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం మున్సిపల్‌ ఛైర్మన్‌ శాంత అధ్యక్షతన కౌన్సిల్‌ హాలులో జరిగింది. పట్టణంలోని 39వ వార్డులో రెండు నెలలుగా తాగునీరు సక్రమంగా రావడం లేదని, పక్కన వార్డుకు వస్తున్నా తన వార్డులో ఎందుకు రావడం లేదని, ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదని కౌన్సిలర్‌ ఫయాజ్‌ అధికారులను నిలదీశారు. 34వ వార్డు కౌన్సిలర్‌ ఇంతియాజ్‌ సైతం తన వార్డులో తాగునీరు సక్రమంగా రావడం లేదని, ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తమను నిలదీస్తున్నారని వాపోయారు. తాగునీటి సరఫరా సిబ్బందిని విచారిస్తే విద్యుత్‌ కోత వల్ల సమస్య ఉందని చెబుతున్నారని, జనరేటర్లను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. ప్రతి సమావేశంలోనూ జనరేటర్ల నిర్వహణ, డీజిల్‌ కొనుగోలుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని కౌన్సిలర్‌ ఫయాజ్‌ విమర్శించారు. బసాపురం ఎస్‌ఎస్‌ ట్యాంకు వద్ద ఉన్న జనరేటర్‌ను మూడేళ్లయినా మరమ్మతులు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎంఇ నాగభూషణం సమాధానం ఇస్తూ... విద్యుత్‌ కోత వల్లనే వారం రోజుల పాటు సమస్య వచ్చిందని, ప్రస్తుతం సమస్య లేదని తెలిపారు. కొత్తగా జనరేటర్లను కొనుగోలు చేస్తామని, పాత జనరేటర్‌ మరమ్మతులు చేస్తే ఎక్కువ ఖర్చవుతుందని, మరమ్మతులు చేయించలేదని కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి తెలిపారు. ఛైర్మన్‌ శాంత మాట్లాడుతూ... తన వార్డులో ఇదే సమస్య ఉందని, పరిష్కరించాలని సూచించారు. పట్టణంలోని పాత ఫ్లైవర్‌ బ్రిడ్జి సైడ్‌ వాల్స్‌ కూలిపోయాయి అలాగే పడ్డాయని, వాటిని తొలగించే అధికారులు లేరని కౌన్సిలర్‌ నాగరత్నమ్మ తెలిపారు. అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అభివృద్ధి కనబడడం లేదని, ఇలా రోడ్డుపైనే ఉంటే ఎలా అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాత బ్రిడ్జి నిర్వహణ ఆర్‌ అండ్‌ బి అధికారులు చేస్తున్నారని, ఇక్కడ తమకేమీ చేసే అవకాశం లేదని ఎంఇ తెలిపారు. పాత బ్రిడ్జి సైడ్‌ వాల్స్‌ తొలగించి ఐరన్‌ గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్‌ రఘునాథ్‌ రెడ్డి సూచించారు. వెంకన్న బావి వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో పిల్లలు పడి మృతి చెందే అవకాశం ఉందని, వాచ్‌మేన్‌ను ఏర్పాటు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్‌ శాంతి కోరారు. ఈనెల 23న పట్టణంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన మెప్మా బజార్‌కు కౌన్సిలర్లను చివరకు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ను కూడా పిలువ లేదని మెప్మా అధికారి సెమినాను కౌన్సిలర్లు, ఛైర్మన్‌ శాంత, వైస్‌ ఛైర్మన్‌ నరసింహులు నిలదీశారు. అలాగే వార్డులో పొదుపు గ్రూపుల సమావేశం జరుగుతున్నా ఆర్‌పిలు పిలవడం లేదని, ఆర్‌పిలు అక్రమాలకు పాల్పడుతున్నారని జ్యోతి గ్రూపు ఆర్‌పిలు రూ.లక్షలు స్వాహా చేశారని సభ్యులు విమర్శించారు. కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ... మెప్మా బజార్‌ ప్రారంభానికి చివరి క్షణంలో సమాచారం అందిందని, నిధులు స్వాహా చేసిన గ్రూప్‌ నుంచి రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు. మెప్మా అధికారి సెమినాను పీడీకి సరెండర్‌ చేయాలని వైస్‌ ఛైర్మన్‌ నరసింహులు డిమాండ్‌ చేశారు. రాంజల నీటిని తాగునీటి కోసం వినియోగంలోకి తీసుకురావాలని, 1వ వార్డులో అనేక ప్రాంతాల్లో రోడ్ల సమస్య ఉందని కౌన్సిలర్‌ పార్వతి తెలిపారు. రాంజల నీటిని తాగునీటి కోసం వినియోగించరాదని కర్నూలు మెడికల్‌ కళాశాల నివేదిక ఇచ్చిందని, గతనెలలో కూడా అదే నివేదిక వచ్చిందని నాగభూషణం తెలిపారు. నీటిని ఖాళీ చేస్తున్నామని, త్వరలోనే ఎల్‌ఎల్‌సి నీటిని చెరువు నింపి అందిస్తామని చెప్పారు. కౌడల్‌ పేట ప్రాంతంలో డ్రెయినేజీలు నిర్మించాలని కౌన్సిలర్‌ కోరారు. ఇంద్రనగర్‌ ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి భూమి పూజ చేశారని, ఇంతవరకు పనులు చేపట్టలేదని, ఇప్పటికైనా పనులు చేపట్టాలని కౌన్సిలర్‌ చలపతి కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్లు
సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్లు