- జీపీఎస్ ను రద్దు చేసి, ఓపియస్ ను అమలుచేయాలసిందే : యుటిఎఫ్
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సిపిఎస్ కు బదులుగా ప్రకటించిన జిపిఎస్ విధానాన్ని అంగీకరించమని, ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని యుటిఎఫ్ నాయకులు చిత్తూరు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న వారిని బలవంతంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు అనేక ప్రాంతాలలో నిరసన దీక్షలను జరిగాయి. పదేపదే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పాత పెన్షన్ విధానాన్ని కోరినా, రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ ను అమలు చేయడానికి పూనుకోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే సమయంలో చెప్పినట్లుగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే 2070 నాటికి రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని చెప్పడం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో నెంబరు 57 ప్రకారం 2004 సెప్టెంబర్ ముందు నియామకం పొందిన 11,000 మందికి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 2024 ఎన్నికల్లో పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పిన పార్టీలకే ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ నిరసన దీక్షకు పలు సంఘాల నాయకులు సంఘీభావాన్ని తెలియజేశారు.

పాలకొల్లు : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని, కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57 ప్రకారం రాష్ట్రంలోని 2003 డిఎస్సీ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పాత పెన్షన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డిమాండ్ చేసారు. పాలకొల్లు సమతా భవనంలో శుక్రవారం ప్రారంభమైన యుటిఎఫ్ దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఉద్యోగులు, కార్మికులతో ప్రభుత్వం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

















