ప్రజాశక్తి-అల్లూరి : ఉద్యోగ ఉపాధ్యాయ ఆకాంక్షలకు వ్యతిరేకంగా జిపిఎస్ బిల్లును శాసనసభలో ఆమోదించడం దుర్మార్గమని సిపిఎస్ ఉద్యోగులకు ఇది చీకటి రోజు అని అనంతగిరి మండల యుటిఎఫ్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని వారంలోపు రద్దు చేస్తామని , ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట తప్పి నాలుగున్నర ఏళ్ల తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలకు భిన్నంగా శాసనసభలో జిపిఎస్ బిల్లును ఆమోదించి హామీని శాసనసభ సాక్షిగా అపహాస్యం పాలు చేసింది అన్నారు. సిపిఎస్ ఉద్యోగులందరికీ ఇది విరుద్ధమని ఆవేదన వెలిబుచ్చారు. జిపిఎస్ వద్దని పాత పెన్షన్ పునరుద్ధరించాలని ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా జిపిఎస్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్యారంటీ లేని పెన్షన్ స్కీమును ఆమోదించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వము వంచిందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేని కొత్త విధానం దేశానికి ఆదర్శమని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. ఉద్యోగుల నుండి కాంట్రిబ్యూటరీ కట్టించుకునే విధానం దేశానికి ఆదర్శమని ఎలా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల భిన్నంగా ముందుకెళుతున్న ప్రభుత్వం తగు మూల్యం చెల్లించక తప్పదన్నారు. భవిష్యత్తులో జిపిఎస్ చట్టం రద్దు పాత పెన్షన్ సాధనకు కలిసొచ్చే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి దేముడు,ఉమ్మడి జిల్లా పూర్వసహాధ్యక్షులు ఎస్ రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ నాయుడు, మండల కోశాధికారి ఎస్ పరమేష్, మండల కార్యదర్శులు బి సింహాచలం, బి విజయ్ కుమార్, బి సింహాచలం, జి పరశురాం పాల్గొన్నారు.










