Sep 01,2023 21:28

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన రంభరజనీకాంత్‌, నర్సిపల్లి తిరుపతి, సాకేటి రాంబాబు

ప్రజాశక్తి- సాలూరు, గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టం విద్యారంగంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. వారిలో సాలూరు పట్టణంలోని బంగారమ్మపేట మున్సిపల్‌ యుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్‌ రంభ రజనీకాంత్‌, జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నరిసిపిల్లి తిరుపతి, వీరఘట్టం మండలం చిట్టిపూడివలస మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సాకేటి రాంబాబు ఉన్నారు.
రెండుసార్లు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రజనీకాంత్‌
సాలూరు :
పట్టణంలోని బంగారమ్మపేట మున్సిపల్‌ యుపి పాఠశాల హెచ్‌ఎం డాక్టర్‌ రంభ రజనీకాంత్‌ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికయ్యారు. ఆయనకి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఇది రెండో సారి. 2018లో జాతీయుపాధ్యాయ సంక్షేమ సంస్థ, రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీతల్లో రజనీకాంత్‌లో ఒకరు. 2021లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కానీ కరోనా కారణంలో అందుకోలేదు. రజనీకాంత్‌ రామానుజన్‌ మేథ్స్‌ క్లబ్‌ను 2001లో ఏర్పాటు చేసి విద్యార్థుల్లో గణితం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఏటా రామానుజన్‌ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు గణితంలో ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు పెంచేందుకు కృషి చేస్తున్నారు. పేద విద్యార్థుల కోసం సొంత ఖర్చులతో ఆటో నడిపి రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన రజనీకాంత్‌కు రెండు సార్లు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, లయన్స్‌ డైమండ్స్‌ క్లబ్‌ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా తిరుపతి
గుమ్మలక్ష్మీపురం :
జియమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నరిసిపిల్లి తిరుపతి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయు అవార్డుకు ఎంపికయ్యారు. 2018- 19 సంవత్సరంలో మొదట సారిగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ప్రతిభా స్కూల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో పనిచేసి చుక్క రామయ్య ప్రశంసలతో అనేక సైన్స్‌ ఫెయిర్‌, జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొని తన విద్యార్థులతో అనేక బహుమతులు పొందారు. 2006 నుంచి 2003 వరకు పార్వతీపురం మండలం డోకిశిల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పనిచేసి సైన్స్‌ పట్ల కుతూహలంతో ప్రత్యేకమైన సైన్స్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులు మూఢనమ్మకాలకు గురికాకుండా సైన్స్‌ పట్ల శాస్త్రీయ దక్పథం పొందేలా కృషి చేశారు. అనేకమంది విద్యార్థులను, ముఖ్యంగా గిరిజన విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచి వారిలో చదువు పట్ల ఇష్టం పెరగడానికి అనేక ప్రాజెక్టులు రూపొందించేందుకు గానూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత వచ్చేందుకు పలువురు అభినందించినట్లు ఆయన చెప్పారు.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా తిరుపతి
వీరఘట్టం : మండలంలోని చిట్టిపూడివలస గ్రామ, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జిటి ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న సాకేటి రాంబాబు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. 2002లో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరిన రాంబాబు మండల, జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపిక అయ్యారు. విద్యా బోధనతోపాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో అధికారులు గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేశారు. తోటి ఉపాధ్యాయులు సెలవుల దొరికితే కుటుంబ సమేతంగా సంతోషంగా కాలం గడుపుతారు. కానీ రాంబాబు మాస్టర్‌ మాత్రం ఆదివారమైనా పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు బోధన చేస్తూ ఉంటారు. అను నిత్యం బోధన చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని రాంబాబు మాస్టర్‌ వద్దకు చదువుల కోసం పంపిస్తూ ఉన్నారు. ఈయన దగ్గర చదివిన సుమారు 200 మంది విద్యార్థులు జవహర్‌ నవోదయ ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలకు ఎంపిక కావ్వడంతో ఆ గ్రామంలో మాస్టర్‌ పట్ల మంచి ఆదరణ పెరుగుతుంది. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎంఇఒ కార్యాలయంలో ఎంఇఒలు డి.గౌరునాయుడు, ఆర్‌.ఆనందరావు రాంబాబును అభినందించారు. వీరితో పాటు పాఠశాల సిబ్బంది కూడా అభినందనలు తెలిపారు.