- ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు కరువు
- సెకెండ్ లాంగ్వేజీకి లభించని ప్రాధాన్యత
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉర్దూ భాషకు రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ భాష హోదా కల్పించినా, ఆ భాషలో చదివే విద్యార్థులకు బోధకుల్లేరు. ప్రధానంగా మున్సిపల్ పట్టణాల్లోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచరు ఒక్కరూ లేరు. దీంతో, ఉర్దూ మాధ్యమంలో చదువుకుంటున్న విద్యార్థుల భవితవ్యం త్రిశంకు స్వర్గంలో పడింది.
- ఒక్క సబ్జెక్టుకూ టీచరు లేరు
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో మైనార్టీ జనాభా 20 శాతం వరకు ఉంది. ఈ దృష్ట్యా పురపాలక సంఘంలోని 11వ వార్డులో ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇక్కడ తరగతులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 208 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఎనిమిది తరగతులకు కలిపి ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారంతా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జిటిలు). వారిలో ఒకరు తెలుగు ఉపాధ్యాయులు, మిగిలిన ఇద్దరూ ఉర్దూ మాధ్యమానికి సంబంధించిన వారు. ఆరవ తరగతి నుంచి బోధించాల్సిన సబ్జెక్టు టీచర్లు (స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు) ఒక్కరూ లేరు. విద్యార్థుల సబ్జెక్టులన్నీ ఉర్దూలోనే ఉండడంతో ఉన్న ఇద్దరు ఉర్దూ ఉపాధ్యాయులే ఎనిమిది తరగతుల పిల్లలకూ సబ్జెక్టులు బోధించాల్సి వస్తోంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు తొమ్మిది, పది తరగతులకు మరో ఉన్నత పాఠశాలకు వెళ్లాలి. అక్కడ ఉర్దూ మీడియం లేకపోవడంతో తెలుగులో చదువుకోవాల్సి వస్తోంది. దీంతో, ఉర్దూ చదువును మధ్యలోనే ఫుట్‌స్టాఫ్ పడుతోంది. ఇటువంటి పరిస్థితి ఈ ఒక్క పాఠశాలలోనే కాదు... ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి, రాయదుర్గం, హిందూపురంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలల్లోనూ ఉంది. ఈ పాఠశాలలు ఒక్క సబ్జెక్టు టీచరు కూడా లేకుండా నడుస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 221 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 20 ఉన్నత పాఠశాలలు. రాష్ట్ర వ్యాప్తంగా 300కుపైగా ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి. 20 వేల మందికిపైగా విద్యార్థులు వీటిలో చదువుతున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఉర్దూ విద్యనభ్యసించే వారు అధికంగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది బాలికలే. ఉపాధ్యాయులు లేని కారణంగా ప్రాథమిక విద్య వరకు చదువుకున్న తరువాత విద్యార్థినులు డ్రాపవుట్స్ అవుతున్నారు.
- ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూను ద్వితీయ భాషగా ప్రకటించింది. అయితే, ఆ భాషకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదు. ఉర్దూ మాధ్యమంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి కొన్ని దశాబ్దాలు అవుతోంది. దాదాపుగా అన్ని ఉన్నత పాఠశాలల్లోనూ సబ్జెక్టు టీచర్లు లేక పిల్లల విద్య మధ్యలోనే ఆగిపోతోంది. ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి.
- ముస్కిన్, ఆవాజ్ అనంతపురం జిల్లా కార్యదర్శి










