Aug 12,2023 20:16

ఉరుకుందలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - కౌతాళం
ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం పాలకమండలి మండలి ఛైర్మన్‌ నాగ రాజ్‌ గౌడ్‌, సహాయ కమిషనర్‌ వాణి, ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి పుణ్యక్షేత్ర పరిసరాల్లో పర్యటించారు. భక్తులకు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లను పరిశీలించారు. దర్శనంతో పాటు దేవాలయ అధికారులు కేటాయించిన వివిధ ధరల క్యూలైన్లు, విఐపి క్యూ లైన్లు ఉండే విధంగా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లను చేస్తున్నారు. అనంతరం తాత్కాలిక షెడ్లతోపాటు, టికెట్ల కౌంటర్‌, కల్యాణకట్ట, అన్నదాన సత్రం, స్వామివారి ప్రసాదాల కౌంటర్‌ ఏర్పాటు చేయడానికి సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పుణ్యక్షేత్రానికి నలువైపులా పార్కింగ్‌ సౌకర్యం చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ముఖ్యమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. దొంగతనాలను అరికట్టడానికి సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సింటెక్స్‌ ట్యాంకులు ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పుణ్యక్షేత్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. వ్యాపారులు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసుకొని ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని శాఖ అధికారుల సహాయ, సహకారాలతో భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ పనులు ఉత్సవాలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని వివరించారు.