ఉప్పొంగిన ఆనందం
- భారీ వర్షంతో రైతన్నలు హర్షం
ప్రజాశక్తి - కొత్తపల్లి
కొత్తపల్లి మండలంలో రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని వాగులు వంకలు పొంగి పారడంతో గ్రామాల్లో ఉన్న రైతులు ఆనందం వ్యక్త పరుస్తున్నారు. తొలకరి నుంచి వర్షాలు లేక అరకొరగా అక్కడక్కడ కురిసిన వర్షాలకు కొన్ని గ్రామాల్లో ఉన్న రైతులు మొక్కజొన్న, పత్తితో పాటు పలు పంటల విత్తనాలు నాటడం జరిగింది. అప్పటినుంచి వర్షాలు లేక అరకొరగా వేసిన విత్తనాలు మొలకెత్తుతాయో లేదోనని ఎదురు చూస్తున్న తరుణంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంకు ఎక్కడ చూసినా వర్షపు నీరు కనిపించడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తుంది. మండలంలో ఏకంగా 103.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో నేటి వరకు విత్తనాలు వేయని రైతులు విత్తనాలు వేసే పనిలో బిజీ బిజీగా కనిపిస్తున్నారు. ఆలస్యంగానైనా రైతన్నలకు సమృద్ధిగా వర్షం కురిసిందని పలు గ్రామాల్లో ఉన్న రైతులు చర్చించుకుంటున్నారు.
నీట మునిగిన పంటలు
పాములపాడు : మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో మొక్కజొన్న, తదితర పంటలు నీటమునిగాయి. కొంతమంది రైతుల పొలాలు మొక్కజొన్న మొలక స్టేజిలో ఉండడంతో నీరు నిలువున్న ప్రదేశాల్లో పంట మొత్తం నష్టం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వంకలు వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఆత్మకూర్: ఆత్మకూరు మండలంలో మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారుజామున వరకు భారీ స్థాయిలో వర్షం పడటంతో మండలంలోని పంట పొలాల్లో చెరువులు తలపించే రీతిగా వర్షపు నీరు నిలబడింది. రెండు రోజులుగానే దాదాపు పది సెంటీమీటర్లు వర్షం నమోదయింది. వర్షం భారీ స్థాయిలో పడడంతో రైతులు తమ పంట పొలాల్లో వేసుకో వలసిన విత్తనాల కొరకు ప్రైవేట్ షాపుల వద్ద కొనుగోలుకు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. మండలంలోని శివ భాష్యం గౌడ్ ప్రాజెక్ట్ సగానికి పైగా వర్షం నీరు చేరినట్లు తెలుస్తుంది.










