ప్రజాశక్తి - హోళగుంద
ఎల్‌ఎల్‌సి కాలువ ఆయకట్టు సాగు భూముల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. అదునుగా భావించిన రైతులు పంట పొలాల్లో గేజ్ వెల్ తిప్పి పదును చేసుకొని వరి నారు అంటించడానికి సిద్ధంగా ఉన్నారు. 40 రోజుల క్రితం నీరు లభ్యత ఉన్న బోరు, బావుల దగ్గర వరిమళ్లు వేసుకొని ఉండగా, అంటించడానికి నారు చేతికి వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు.
వరి నారుకు పెరిగిన గిరాకీ
వరినారుకు గిరాకీ పెరిగిందని, ఒక సెంటు వరి నారు రూ.1000 చొప్పున కొనుగోలు చేస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 3 సెంట్లు అవసరమవుతుందని, నారు కోసమే ఎకరాకు రూ.3 వేలు ఖర్చు పెట్టక తప్పడం లేదని చెబుతున్నారు.
భారంగా మారిన ఎరువులు
ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయం భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎపి ధర రూ.1350, 10-26 ధర రూ.1470, 20-20 ధర రూ.1400, 16-20 ధర ర.1350, యూరియా రూ.270 ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
రెండేళ్లుగా నష్టపోతున్న రైతులు
రెండేళ్లుగా వ్యవసాయం వల్ల నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఎరువుల ధరపై సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. రైతు దగ్గర నుంచి ఒక బస్తా వరి ధాన్యం రూ.1400 నుంచి రూ.1500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక బస్తా వరి ధర ఒక సంచి ఎరువుతో సమానంగా ఉంది. వ్యవసాయం వల్ల లాభం పొందలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల పాలైనా వ్యవసాయం చేయక తప్పడం లేదని వాపోతున్నారు. ఈఏడాది పెస్టిసైడ్ ధరలు పెరిగాయని, మందులు ఎలా పిచికారి చేయాలని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులు, పురుగు మందులను రాయితీ కింద అందజేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
వరి నాట్లు వేస్తున్న రైతులు










