Jul 20,2023 20:46

పాఠశాలకు తాళం వేస్తున్న విద్యార్థుల తల్లదండ్రులు

ప్రజాశక్తి - హాలహార్వి
పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. పాఠశాలకు తాళం వేశారు. ఉపాధ్యాయులను నియమించే వరకు తాళం తీసేది లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటన హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో చోటు చేసుకుంది.
హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో ఉన్న ఎంపిపి పాఠశాలలో 252 విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు ఒక్కరే ఉన్నారు. అంతమంది విద్యార్థులకు ఒక్కరే చదువు చెప్పలేరు. ఈ పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులు అవసరం. కానీ ప్రధానోపాధ్యాయులు ఒక్కడే ఉన్నారు. తమ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని ఐదు తరగతులకు చెందిన విద్యార్థులు కర్నూలు కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చి 20 రోజులయినా స్పందన మాత్రం లేదు. చదువు చెప్పే ఉపాధ్యాయులు లేకపోవడంతో టీచింగ్‌ స్టాఫ్‌ కొరతను నిరసిస్తూ గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలకు తాళం వేశారు. ఉపాధ్యాయులను నియమించే వరకూ పాఠశాలకు వేసిన తాళాలు తీసేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 252 మంది విద్యార్థులు ఉన్నారని, ఇక్కడ చదువు చెప్పేందుకు ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాలకు తాళం వేశారు. ఓ వైపు విద్యార్థులు లేక చాలా పాఠశాలలు మూత పడుతుంటే తమ గ్రామంలో విద్యార్థులు ఉన్నా, ఉపాధ్యాయులు లేక మూతబడుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని పాఠశాలకు తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు వేసిన తాళం తీసేది లేదని స్పష్టం చేశారు.