Jul 26,2023 19:12

ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు ఎలా చదువుకుంటారని పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర బాబు, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర ప్రశ్నించారు. బుధవారం మండలంలోని గార్లదిన్నె పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారని అన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి గదులేలక పాఠశాల వరండాల్లో చదివే పరిస్థితి ఉందన్నారు. ఆ పాఠశాలకు వంట గది లేక తరగతి గదిలో వంట చేసే దుస్థితి ఉందన్నారు. పాఠశాలలో 90 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఉపాధ్యాయులు, తరగతి గదుల్లేక విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయులను, తరగతి గదులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే విద్యార్థులతో కలిసి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎఐటియుసి తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు, రవి, చిన్న, మహేష్‌, బాషా పాల్గొన్నారు.