ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి
డిఇఒ కార్యాలయం ముందు యుటిఎఫ్ నిరసన
ప్రజాశక్తి - నంద్యాల
బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని, ఇది రాష్ట్ర విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరే అని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, రామ్ మోహన్‌లు విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం డిఇఒ కార్యాలయం ముందు యుటిఎఫ్ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 12 నాటికి బదిలీలు, 25 నాటికి అన్ని క్యాడర్‌ల ప్రమోషన్‌ల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. ఆయినా క్యాడర్ స్ట్రెంత్ అప్డేషన్ పెరుతో, అర్థిక శాఖ అనుమతి పేరుతో జూన్, జూలై నెలలు జీతాలు చెల్లించలేదని విమర్శించారు. బదిలీలు, ప్రమోషన్‌లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని ఒక వైపు అధికారులు గొప్పగా చెపుతున్నారని, రెండో వైపు జీతాల చెల్లింపులో పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు అలసత్వం వీడి జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు పిసి హెచ్.బాలస్వామి, కె.రామ కృష్ణుడు, రాష్ట కౌన్సిలర్ ఎం.ఐజయ్య, సీనియర్ నాయకులు బి.రామ పుల్లారెడ్డి, పి.గోపాల్, జి.మొహమ్మద్ హుస్సేన్, నాయకులు పాల్గొన్నారు.










