ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు వారు బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య నాయకులు మాట్లాడుతూ పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. పాఠశాల వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్న జీవో ఎం ఎస్ 117ను రద్దు చేయాలని, బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, సిఆర్‌సి ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల వేతనాలు 11 పిఆర్‌సికి అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కోడూరు శ్రీనివాస్, రామకృష్ణ, కోనంకి చంద్రశేఖర్, హరిప్రసాద్, ఆర్ చంద్ర, సురేంద్ర, శివ శంకర్, జయశేఖర్, జయరాం రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.










