Jun 06,2023 22:35

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల్లో చోటు చేసుకున్న అసంబద్దాలను తొలగించాలని యుటిఎఫ్‌ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం జెఎన్‌టియు సమీపంలోని సైన్స్‌ సెంటర్‌లో జిల్లా విద్యా శాఖ అధికారి సాయిరాంను యుటిఎఫ్‌ నాయకులు కలిసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో అనేక తప్పులు చోటు చేసుకున్నాయన్నారు. సోషియల్‌ స్టడీస్‌ (కన్నడ మీడియం) సీనియారిటి లిస్ట్‌లో అవకతవకలు జరిగాయని తెలిపారు. డీఎస్సీ 2000కు సంబంధించిన ఎవి.రాధారిణి, ఎస్‌జిటి(కన్నడ), ఎంపియుపిఎస్‌, ఓబుళాపురం గ్రామం, డీ హీరేహాల్‌ను పొజిషనల్‌ సీనియారిటీ లిస్ట్‌లో చూపించారన్నారు. అయితే ఫైనల్‌ సీనియారిటీ లిస్ట్‌లో తనకన్నా జూనియర్‌ అయిన డీఎస్సీ-2002కు చెందిన గంజి తిప్పేస్వామిని (ఎస్‌జిటి కన్నడ) చూపించారని చెప్పారు. సీనియర్‌ ఎవి.రాధారాణి అభిప్రాయం తీసుకోకుండా లిస్ట్‌ నుంచి తొలగించారని అన్నారు. అలాగే బదిలీ ప్రక్రియలో తప్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. బదిలీల సాఫ్ట్‌వేర్‌లో 16-5-2013న ఆ పాఠశాలకు సంబంధించిన స్టేషన్‌ పాయింట్స్‌ 30.1230గా చూపిస్తోందన్నారు. 15-5-2013న చేరిన వారికి స్టేషన్‌ పాయింట్స్‌ 30.18780గా చూపిస్తోందన్నారు. ఈ సమస్య ఎస్‌జిటి, ఎస్‌ఎ(టి) ఇతర క్యాడర్‌ల వారికి ఉందని సాఫ్ట్‌వేర్‌ సమస్యను సరి చేయాలని కోరారు. బదిలీల్లో కొన్ని పోస్టులను బ్లాక్‌ చేయడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట బ్లాక్‌ చేసి, తక్కువ మంది పిల్లలు ఉన్న చూపించడం జరిగిందన్నారు. దీని వల్ల చాలా మంది విద్యార్థులు సబ్జెక్ట్‌ టీచర్‌ లేకపోవడం వల్ల డ్రాపౌట్స్‌గా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట చూపించి, తక్కువ మంది పిల్లలు ఉన్న చోట బ్లాక్‌ చేయాలని కోరారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సరి చేయాలని వారు డిమాండ్‌ చేశారు.