May 20,2023 09:06

వీరాపురంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

'ఉపాధి'పై కత్తి..!
           చిలమత్తూరు : 2004లో వామపక్షాల ఆధ్వర్యంలో కూలీలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి కుట్ర చేస్తోంది. నిబంధనల పేరుతో పనిదినాలు, కూలీల సంఖ్యను తగ్గించే కుట్ర చేస్తోంది. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ కూలీల కడుపునింపుతోంది. గ్రామాల్లో ఈ పనులు చేసుకుంటూ కూలీలు కుటుంబ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉపాధిపై కేంద్ర ప్రభుత్వం నిబంధనల కత్తిని వేలాడదీస్తోంది. కొత్తకొత్త నిబంధనలు, మార్పులు, షరతులు తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో కూలీలను ముప్పతిప్పలు పెడుతున్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనితీరును పరిశీలించేందుకు 'ప్రజాశక్తి'శుక్రవారం నాడు చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామంలో పర్యటించింది. ఈ గ్రామంలో కూలీలు తమ సమస్యలను తెలియజేశారు.
            ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు రోజువారి పనిని బట్టి రోజుకు రూ.272 కూలి ఇవాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది రూ.150 లోపే పడుతోంది. ఆన్‌లైన్‌ మస్టర్‌ ఫీడింగ్‌, హాజరు నమోదులో లోపాలు టెక్నికల్‌ సమస్యలు ఇలా అనేక కారణాల చేత గతంలో కన్నా పని అధికం చేసినా కూలి మాత్రం తక్కువగా పడుతోంది. దీనికితోడు పని చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు అందని పరిస్థితి నెలకొంది. చేసిన పనులకు పేస్లిప్‌లు ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వారాలకి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఉపాధి హామీ అమలుపై ప్రభుత్వాలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది.
ఆన్‌లైన్‌ మస్టర్‌తో అవస్థలు
             ఉపాధిలో నూతనంగా అవలంబిస్తున్న విధానాల్లో భాగంగా ఆన్‌లైన్‌ మస్టర్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని వల్ల కూలీలు పూర్తిగా నష్టపోతున్నారు. సాధారణంగా ఉపాధి పనులను చెరువు, కుంటలు, అటవీ ప్రాంత సరిహద్దులు, కొండలు గుట్టల్లో కల్పిస్తారు. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌లకు నెట్‌వర్క్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో ఆన్‌లైన్‌ కూలీల హాజరు వేయడం చాలా కష్టంగా ఉంటోంది. ఆన్‌లైన్‌ హాజరు వేయకపోతే కూలీకి ఆ రోజు కూలి పోయినట్లే. దీనికితోడు రోజుకు రెండు పూట్ల పని చేయాలనే నిబంధన కూడా కూలీలను ఇబ్బందులపాలుజేస్తోంది. చేసిన పనులకు సంబంధించి కొలతల ఆధారంగా కూలి ఇస్తారు. ఒక వేళ ఈ కొలతలు ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ కాకపోతే కూలీలు పని చేసినా కూలి డబ్బులు వారి ఖాతాల్లో జమకావు.
కనీస సౌకర్యాలు కానరావు
                 పని చేసే ప్రదేశంలో ఉపాధి కూలీలకు కల్పించే కనీస సౌకర్యాలు మచ్చుకైన కన్పించవు. పనులు జరుగుతున్న ఏ ప్రాంతంలో పరిశీలించినా సౌకర్యాలలేమి కన్పిస్తుంది. పనిచేసే చోట మంచినీళ్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు, టెంట్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆచరణలో ఇవి అమలుకావడం లేదు. ఇక పనిముట్లు ఎప్పుడిచ్చారో కూడా తెలియని పరిస్థితినుంది. ఉపాధికి సంబంధించి పనిముట్లు ఇస్తారన్న సంగతి కూడా కూలీలకు తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి ప్రారంభంలో మంచినీళ్లకు రూ.5, ఉపాధి పని ప్రదేశం 5కి||మీ|| దాటితో రానుపోను ఛార్జీలు, గునపం సానకు డబ్బులను ప్రభుత్వం ఇచ్చేది. కొత్త విధానాలు అమల్లోకి వచ్చాక వీటిన్నంటినీ ప్రభుత్వం రద్దు చేసింది.
ఉపాధి పనితోనే జీవనం
 బావన్న, లక్ష్మీపురం, చిలమత్తూరు మండలం
            నాకు 73 సంవత్సరాలు. కుటుంబ జీవనం గడవాలంటే కూలి పనులు చేసుకోవాల్సిందే. గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనులు తనలాంటి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. అయితే రానురాను ఉపాధిలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ పథకం ప్రారంభంలో ఉన్నన్ని సదుపాయాలు ఇప్పుడు లేవు. పనుల కల్పన, కూలి చెల్లింపు, వసతులు ఇలా అన్నింటిలోనూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కన్పిస్తోంది. మండుటెండలో చేతులకు బొబ్బులు వచ్చేలా పని చేసినా కూలి మాత్రం నామమాత్రంగానే వస్తోంది. కొత్తకొత్త నిబంధనలు చెప్పి కూలీలను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇటీవల చేసిన పనులకు కూలి సక్రమంగా పడటం లేదు. గతంలో మా ఉపాధి సంఘంలో వందమంది ఉండేవారం.. ఇప్పుడు 20కు తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్ణయాలే ఇందుకు కారణం.
బిల్లులు ఇవ్వకుంటే ఎలా..?
భాగ్యమ్మ, వీరాపురం, చిలమత్తూరు మండలం.
            ఏడు వారాల నుంచి ఉపాధి పనులు చేస్తున్నాం. ఇందులో ఒక్క వారం బిల్లు మాత్రమే వచ్చింది. కూలీ కూడా చాల తక్కువ వచ్చింది. 7 రోజులు పనికి 900లే వచ్చింది. ఈ లెక్కన రోజుకు 120 రూపాయలే వచ్చింది. ఇందులో 6 వారాల బిల్లులు పడలేదు. గ్రామంలో ప్రస్తుతం ఎక్కడా వ్యవసాయ పనులు లేవు. ఓవైపు ఉపాధి బిల్లులు ఇవ్వక, మరోవైపు గ్రామంలో ఇతర వ్యవసాయ పనులు లేకపోతే తాము ఎలా జీవించాలి. ప్రభుత్వం స్పందించి ప్రతి వారం బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలి.
ఉపాధి నిర్వీర్యానికి కుట్ర
పి.ప్రవీణ్‌కుమార్‌,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు.

                 గ్రామాల్లో కూలీలకు ఎంతో బాసటగా ఉపాధి హామీ చట్టం నిలుస్తోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉపాధిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన విధానాలు, షరతుల కారణంగా క్షేత్రస్థాయిలో పేదలు ఉపాధి దూరం అయ్యే ప్రమాదం ఏర్పడింది. గ్రామాల్లో పనులు లేక కుటుంబ పోషణ నిమిత్తం కూలీలు వలసల బాట పడుతున్నారు. ఉపాధిపై కేంద్రం తీసుకుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా కూలీలను ఇబ్బందిపాలుజేసేలా ఉన్నాయి. దీనిని వ్యవసాయకార్మిక సంఘంగా ఖండిస్తున్నాం. ఉపాధి రక్షణ నిమిత్తం కూలీలకు అండగా పోరాటం సాగిస్తాం. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీన శ్రీసత్యసాయి కలెక్టరేట్‌ వద్ద కూలీలతో కలిసి మహాధర్నాను నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధిచెప్పి, ఉపాధిని రక్షించుకునేందుకు జరిగే ఈ పోరాటంలో కూలీలు పాల్గొని విజయంతం చేయాలి.