May 23,2023 09:13

శ్రీ సత్యసాయి కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉపాధి కూలీలు, వ్యకాసం నాయకులు

              పుట్టపర్తి కలెక్టరేట్‌ : గ్రామాల్లో పేదలకు అండగా ఉంటూ, కుటుంబ ఆర్థిక అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్నీ నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దుర్మార్గమైన దాడిని కొనసాగిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ, కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం నాడు వ్యకాసం ఆధ్వర్యంలో పుట్టపర్తి కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ముందుగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉపాధి కూలీలు స్థానిక గణేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 'ఉపాధి చట్టాన్ని పరిరక్షించండి.. పని దినాలు పెంచండి.. రోజు కూలి రూ.600 ఇవ్వండి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.పెద్దన్న అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లు, బడాబాబులకు రుణమాఫీ చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజు కూలి రూ.600 ఇవ్వడానికి చేతులు రావడం లేదన్నారు. ఈ వేసవిలో మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు వడదెబ్బకు గురై రాష్ట్రవ్యాప్తంగా 58 మంది మతి చెందారన్నారు. వారి కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏటా ఈ పథకానికి లక్షల కోట్లు కేటాయించే ప్రభుత్వం ఈ ఏడాది 33 వేల కోట్లు మాత్రమే మంజూరు చేసిందన్నారు. నిధులు మంజూరు చేయకుండా పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను పక్కదారి పట్టిస్తూ కూలీల కడుపు కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఉపాధి పనులపై వ్యవసాయ కార్మిక సంఘం బందాలుగా పర్యటిస్తే కూలీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పని ప్రదేశాల్లో ఎక్కడా కూలీలకు నిలువనీడలేదన్నారు. నీళ్లు, మెడికల్‌ కిట్లు అందుబాటులో లేవన్నారు. కూలీలకు తప్పనిసరిగా ఈ వసతులన్నింటినీ కల్పించాలని ఉపాధి హామీ చట్టంలో ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. పనులకు సంబంధించి పే స్లిప్పులు, వారానికి ఒకసారి బిల్లులు ఇవ్వాలన్న నిబంధన కూడా అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. పలు గ్రామాల్లో పనులు చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి ఉపాధిని నిర్వీర్యం చేసే విధానాలు మాని దానిని మరింత పటిష్టం చేసే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కూలీకి 200 రోజుల పనిదినాలు కల్పించి రోజు కూలి రూ.600 ఇవ్వాలన్నారు. అవసరమైన పనిముట్లు ఇవ్వాలన్నారు. రెండు పూటల పని విధానాన్ని తక్షణం రద్దు చేయాలన్నారు. ఆన్‌లైన్‌ మస్టర్‌ విధానాన్ని అమలు చేయరాదన్నారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేయాలన్నారు. కూలీల కోసం పోరాడి తెచ్చుకున్న ఉపాధి చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అనంతరం ధర్నా చేస్తున్న కూలీల దగ్గరకు డ్వామా పీడీ రామాంజనేయులు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. బుధవారం నాడు ప్రతినిధులు వస్తే చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, జిల్లా నాయకులు రమేష్‌, పైపల్లి గంగాధర్‌, వెంకటరమణ, బాలస్వామి, బ్యాళ్ల అంజి, జిల్లా శ్రామిక మహిళా అధ్యక్షురాలు దిల్షాద్‌బీ, సిఐటియు, కెవిపిఎస్‌ నాయకులు సాంబశివ, లక్ష్మీనారాయణ, వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి పవన్‌ తదితరులు పాల్గొన్నారు.