May 31,2023 08:57

ఉపాధి అవినీతి

        అనంతపురం ప్రతినిధి : ఉపాధి హామీ పథకంలో అచ్చంగా కోటి రూపాయలకుపైగానే కనగానపల్లి మండలం ఒక్క చోటే ఏడాది కాలంలో మింగేశారు. ప్రధానంగా డ్రైల్యాండు హార్టికల్చర్‌ పేరుతో ఈ అవకతవకలు జరిగినట్టు సామాజిక తనిఖీల్లోనూ స్పష్టమైంది. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో ఉపాధి హామీ పథకం అమల్లో పెద్దఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. వైసిపి నాయకులు బాహాటంగా జరిగిన ఘర్షణతో ఈ అవినీతి కాస్త రచ్చకెక్కింది. నాయకులు, ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సిబ్బంది కలిసి వ్యవసాయ కూలీలకు దక్కాల్సిన డబ్బులను ఉద్యానవన మొక్కల పెంపకం పేరుతో దోచేశారు. కూలీలు పనిదినాలు సరిపోవడం లేదంటూ ఆందోళనలు చేస్తుంటే, నేతలు, అధికారులు మాత్రం మధ్యలోనే కాజేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
అచ్చంగా కోటి రూపాయలకుపైగా అవకతవకలు
        కనగానపల్లి మండలం పరిధిలో 18 గ్రామ పంచాయతీలున్నాయి. వీటన్నింటి పరిధిలో ఏప్రిల్‌ ్‌ఒకటి 2022 నుంచి 2023 మార్చి 31 వరకు జరిగిన పనుల్లో చూసినప్పుడు సుమారు కోటి రూపాయలకుపైగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒక్క కోనాపురం గ్రామం పరిధిలోనే రూ.30 లక్షల రూపాయలు నిధులను నిబంధనలకు విరుద్ధంగా కాజేశారు. ఇక ఆ తరువాత మద్దెలచెరువు గ్రామ పంచాయతీ పరిధిలో రూ.18.67 లక్షలు ఇదే రకంగా మొక్కల పేరుతో డబ్బులు డ్రా చేశారు. దాదలూరు గ్రామ పంచాయతీ పరిధిలో రూ.17.17 లక్షలు, భానుకోట గ్రామ పంచాయతీ పరిధిలో రూ.8.81 లక్షలు, కొండాపల్లి పరిధిలో రూ.15.99 లక్షలు, భద్రాపురంలో రూ.3.9 లక్షలు, కోనేటిపాలెం రూ.2.26 లక్షలు ,ముక్తాపురం గ్రామం పరిధిలో రూ.8.47 లక్షలదు, మామిళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రూ.2.70 లక్షలు, ముత్తవకుంట గ్రామ పంచాయతీ పరిధిలో రూ.3.33 లక్షలు, తూముచెర్ల పరిధిలో రూ.7.34 లక్షలు ఇవి ప్రధానమైన పనులకు సంబందించి మాత్రమే. ఇక లక్షల్లోపు జరిగిన పనులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు కోటి రూపాయలకుపైగా అవకతవకలు జరిగాయి. ఇంత పెద్దఎత్తున ఒక్క మండలం పరిధిలో చోటు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అవి కూడా ఒక్క ఏడాది కాలంలో జరిగిన అవినీతే ఇది. అంతక మునుపు సంవత్సరాల్లో ఏ మేరకు జరిగిందోనన్నది చూడాల్సి ఉంది. కూలీలకు దక్కాల్సిన డబ్బులను మధ్యలోనే కాజేసి వారి కడుపులు కొడుతుండటం గమనార్హం.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
పెద్దన్న ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు.

        ఒకవైపు ఉపాధి పనులు కల్పించాలని వ్యవసాయ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. పనిదినాలు సరిపోవడం లేదని అంటున్నారు. మరోవైపు ఈ నిధులను కూలీలకు దక్కకుండా నాయకులు, అధికారులు కలసి కాజేస్తున్నారు. సామాజిక తనిఖీల్లో ఇవి తేలుతున్నా చర్యలుండటం లేదు. మరింత పకడ్బాందీగా కూలీలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.