మడకశిర రూరల్ : భానుడు భగభగమంటున్నాడు. ఇంటినుంచి కాలుతీసి బయటకు వేయాలంటనే భయంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కూలీలు పొట్టకూటికోసం ఉపాధి పనులకు వెళ్తున్నారు. సూరీడు సుర్రమంటూ శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా కుటుంబ పోషణ కోసం మండె ఎండలో కష్టపడుతున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలు పనిచేసే ప్రదేశంలో టెంట్లు వేసి నీడను ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా మచ్చుకైనా కన్పించడం లేదు. ఉపాధి పనులు చేసే ప్రదేశాల్లో ఎక్కడ పరిశీలన జరిపినా ఎండలో పనిచేసే కూలీలే కన్పిస్తారు. పనిచేసి అలసిపోయిన కూలీలు కాసేపు సేదదీరుదామంటే నిలువనీడలేక అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పనుల పరిశీలనలో భాగంగా శనివారం నాడు ప్రజాశక్తి మడకశిరలోని పలు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల్లోనూ కూలీలకు వసతులు ఏర్పాటు చేయని పరిస్థితులే కన్పించాయి.
మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామ సమీపంలోని చెరువు వద్ద అమత సరోవర్ కింద చెరువు నుంచి మట్టిని ట్రాక్టర్ ద్వారా రైతుల పొలాల్లోకి తొలే పనులను చేపట్టారు. దాదాపు ఇక్కడ 120 మంది వరకు కూలీలు పనులు చేస్తున్నారు. ఇంతమంది పని చేస్తున్న చోట కనీసం తాగడానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. కూలీలు ఇంటి వద్ద నుంచే బాటిళ్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. తెచ్చుకున్న బాటిల్ నీళ్లు కూడా అరగంటలోనే అయిపోతున్నాయి. ఆ తరువాత చేసేది లేక నోరు తడారిపోతున్నా అలాగే పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు తాగేందుకు నీళ్లు లేకపోవడం, మరోవైపు ఎండనుంచి కాసేపు ఉపశమనం పొందేందుకు నీడలేక కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మడకశిర మండలంలో 10,586 జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 3000 మంది కూలీలకు అధికారులు పనులు కల్పిస్తున్నారు. ఆయా గ్రామాల్లో పనులు చేస్తున్న ప్రతి చోటా కూలీలు తాగునీరు, వసతి తదితర సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల మేరకు పనిప్రదేశాల్లో కూలీలకు టెంట్లు, తాగునీరు, మెడికల్ కిట్స్ వంటి సదుపాయాల్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఉపాధిని క్రమక్రమంగా నిర్వీర్యం చేసే కుట్రలకు పూనుకుంటోంది. అందులో భాగంగా కూలీలకు వసతులు కల్పించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. పని ప్రదేశంలో వసతులు కల్పించకపోవడం.. బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం.. సాంకేతిక ఇబ్బందులు.. ఇలా పలురకాల సమస్యలను సృష్టించి ఉపాధిని నీరుగార్చే కుట్ర జరుగుతోంది.
కూలి తక్కువ ఇస్తున్నారు..
ఆదిలక్ష్మి, ఉపాధి కూలీ,
ఆమిదాలగొంది గ్రామం.
ఉపాధిలో కూలి చాలా తక్కువ ఇస్తున్నారు. నిబంధనల మేరకు రోజుకు రూ.280 వరకు కూలి రావాల్సి ఉండగా రూ.150కు మించి ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే కొలతలు, ఆన్‌లైన్ పేరుతో అధికారులు మాటదాటవేస్తున్నారు. ప్రస్తుతం అన్ని ధరలూ పెరిగాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు ఇలా అన్నీ పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి కూలి రేట్లను కూడా పెంచాలి. పని ప్రదేశాల్లో మౌలిక వసతులను కల్పించాలి.
టెంట్లు ఏర్పాటు చేయండి
వెంకటేష్, ఉపాధి కూలీ,
ఆమిదాలగొంది గ్రామం.
ఎండలు మండిపోతున్నాయి. ఉపాధి పని ప్రదేశాల్లో నిలువనీడలేక ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఎప్పుడూ ఇంత ఎండలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి పనులు చేయడం చాలా కష్టంగా ఉంటోంది. పనికి వస్తే తప్పా పూటగడవని పరిస్థితి ఉంది. కూలీల ఇబ్బందులపైనా అధికారులు, ప్రభుత్వం స్పందించాలి. పని ప్రదేశాల్లో తాగునీటి వసతిని ఏర్పాటు చేసి, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలి. ఉపాధి పని దినాలు కూడా పెంచాలి.
టెంట్లపై ఎలాంటి ఆదేశాల్లేవ్..
శ్రీకాంత్‌గౌడ్, ఉపాధి హామీ ఎపిఒ.
ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్న మాట వాస్తవమే. ఉపాధి పనిప్రదేశాల్లో టెంట్ల ఏర్పాటుకు సంబంధించి పైఅధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. అందుకే ఎక్కడా వీటిని ఏర్పాటు చేయలేదు. ఉన్నతాధికారులు టెంట్లు ఏర్పాటు చేయాలని సమాచారం ఇస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం.










