ప్రజాశక్తి -పెనుకొండ : ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని అడదాకులపల్లి,మావటూరు గ్రామాలలో ఉపాధి కూలీలు పని చేస్తున్న ప్రదేశానికి వెళ్లి పథకం అమలు తీరును వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న , జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కూలీలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఎంత పని చేసిన కూలి గిట్టుబాటు కావడం లేదని , ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. చేసిన పనికి సకాలంలో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వేసవి అలవెన్స్, పనిముట్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వమే ఉద్దేశ్య పూర్వకంగా కూలీలను పథకానికి దూరం చేయడానికి పూనుకుందని విమర్శించారు. అందులో భాగంగానే బడ్జెట్ లో కోతలు పెడుతోందని విమర్శించారు. కూలీలు ఐక్యంగా సంఘటితంగా పోరాడినప్పుడే ఉపాధి పథకం రక్షింప పడుతుందని తెలిపారు. రాబోయే కాలంలో సంఘం పిలుపులో పాల్గొనాలని నాయకులు ఉపాధి కార్మికులకు పిలుపునిచ్చారు.










