ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలో ఉపాధి పనులు కల్పించడంలో, ఉపాధి హామీ చట్టం కింద రైతులకు అవగాహన కల్పిస్తున్న పండ్ల తోటల పెంపకంపై నిర్లక్ష్యం చేయవద్దని డ్వామా పీడీ అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. శనివారం దేవనకొండ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ చట్టం సామాజిక తనిఖీ బహిరంగ చర్చ వేదిక ఎంపిడిఒ గౌరీ దేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 1226 పనులకు రూ.9,57,65,633 ఖర్చు చేసినట్లు తెలిపారు. సామాజిక తనిఖీ స్టేట్ రిసోర్స్ పర్సన్ తిరుమలేష్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ సిబ్బంది 26 పంచాయతీలో జరిగిన ఉపాధి పనులపై గ్రామసభలు ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో గుండ్లకొండ, ఐరన్‌బండ, జిల్లేడుబుడకల, కరివేముల, పల్లెదొడ్డి, వెలమకూరు, పొట్లపాడు, పి.కోటకొండ, తెర్నేకల్లు గ్రామాల్లో రూ.19,500 అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది వివరించారు. ఈ మేరకు రూ.11,500 రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే పనులను ప్రణాళికలో గుర్తించి ఆ పనులను చేపట్టి కూలీలు వలసలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. అడిషనల్ పీడీ సిద్ధ లింగమూర్తి, సలీం బాష, ఎఫ్‌ఎం ఆదయ్య, ఏపీడీ పద్మావతి పాల్గొన్నారు.
పండ్ల మొక్కలు పంపిణీ : ఉపాధి హామీ చట్టం కింద రాయితీపై అందిస్తున్న పండ్ల మొక్కలను రైతులకు అడిషనల్ పీడీ సిద్ధ లింగమూర్తి, ఏపీడీ పద్మావతి, ఏపీవో కృష్ణమూర్తి పంపిణీ చేశారు. మొత్తం 2300 టెంకాయ, 4000 మామిడి మొక్కలు అందించారు. ఈసీ రంగస్వామి, ఉపాధి హామీ చట్టం సిబ్బంది పాల్గొన్నారు.
బహిరంగ చర్చ వేదికలో మాట్లాడుతున్న పీడీ










