Sep 12,2023 20:16

జాబ్‌ మేళానుద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే పట్టణంలోని రావుస్‌ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వంచినట్లు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తెలిపారు. మంగళవారం రావుస్‌ కళాశాల, ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అధ్యక్షతన మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. మెగా జాబ్‌ మేళాకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, జడ్‌పి ఛైర్మన్‌ పాపిరెడ్డి, కర్నూలు మేయర్‌ బివై.రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రావుస్‌ కళాశాల సిఇఒ తిరుమలరెడ్డి మాట్లాడారు. ఈ మెగా జాబ్‌ మేళాలో సుమారు 25 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. సుమారు 695 మంది నిరుద్యోగ యువత హాజరైనట్లు చెప్పారు. వారిలో వివిధ కంపెనీలకు 260 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఈ మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేద విద్యార్థులకు విద్యతో పాటు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో వివిధ కంపెనీలను ఆహ్వానించి అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ప్రతి పేద విద్యార్థీ ఉద్యోగం పొందాలని ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. వైసిపి సీనియర్‌ నాయకులు జగన్మోహన్‌ రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ రఘు, డీఎస్పీ సీతారామయ్య, తహశీల్దార్‌ ఆంజనేయులు, డిఆర్‌డిఎ పీడీ నాగ లీల, ఎపి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ జిల్లా అధికారి శ్రీకాంత్‌ రెడ్డి, రావుస్‌ డిగ్రీ కళాశాల సొసైటీ ప్రెసిడెంట్‌ బూదూరు రామలక్ష్మమ్మ, కళాశాల సిఒఒ సుజనా రెడ్డి పాల్గొన్నారు.