ఉన్నత ఆశయంతో జగనన్న అమ్మ ఒడి
- విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.217.20 కోట్లు జమ
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్న సమున్నత ఆశయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. బుధవారం రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జగనన్న అమ్మ ఒడి నగదు జమ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని వైయస్సార్ సెంటినరీ హాల్‌లో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మార్క్ఫెడ్ చైర్మన్ పిపి.నాగిరెడ్డి, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హాబీబుల్లా, మున్సిపల్ ఛైర్మన్ మాబున్నిసా, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీతా అమృత్ రాజ్, డిఇఒ సుధాకర్ రెడ్డి తదితరులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో జగనన్న అమ్మ ఒడి పధకం కింద అర్హత కలిగిన తల్లులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున 1,67,084 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.217.20 కోట్లు నేరుగా జమ చేశామని తెలిపారు. పిల్లల చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్న ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. అలాగే నాడు-నేడు కార్యక్రమం కింద ప్రతి పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూరుస్తునట్లు తెలిపారు. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 27,773 మంది విద్యార్థుల తల్లులకు రూ.36.10 కోట్లు, బనగానపల్లిలో 27,128 మందికి రూ.35.26 కోట్లు, డోన్‌లో 28,575 మందికి రూ.37.14 కోట్లు, నందికొట్కూర్‌లో 25,560 మందికి రూ.33.22 కోట్లు, నంద్యాలలో 26,580 మందికి రూ.34.55 కోట్లు, పాణ్యంలో 8536 మందికి రూ.11.09 కోట్లు, శ్రీశైలంలో 22,932 మందికి రూ.29.81 కోట్లు తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్, మార్క్‌ఫెడ్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ తదితరుల చేతుల మీదుగా విద్యార్థులు, విద్యార్థుల తల్లులకు అమ్మఒడి మెగా చెక్కును అందజేశారు.










