Sep 17,2023 00:24

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అప్పలనర్స, నాయకులు

ప్రజాశక్తి- పాడేరు:విశాఖ ఉక్కు పరిరక్షణ యాత్ర ను జయప్రదం చేయాలని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి పి.అప్పల నర్శ పిలుపునిచ్చారు. పాడేరు సి.పి.ఎం కార్యాలయంలో శనివారం ఉక్కు రక్షణ యాత్ర పోస్టర్‌ను పార్టీ మండల కార్యదర్శి ఎల్‌ సుందరరావు, పి.లక్కు తో కలిసి జిల్లా కార్యదర్శి పి అప్పలనర్శ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేయాలని నిర్ణయించారన్నారు. దీనికి వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు గత వెయ్యి రోజులుగా పోరాడు తున్నారన్నారు. రాష్ట్రవ్యాపితంగా బందులతో సహా వివిధ రూపాలలో జరిగిన పోరాటాలలో రాష్ట్ర ప్రజానీకం విశాల మద్దతు లభిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్ర అధికార పార్టీని విమర్శిస్తున్నాయి తప్ప ప్లాంట్‌ను అమ్మేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట కూడా అన లేదని తెలిపారు. దీనిని అదునుగా తీసుకొని నరేంద్రమోడీ ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్ను సామర్థ్యంతో నడప లేదని మూడవ బ్లాస్ట్‌ పర్నెస్‌ ను మూసివేసిందనీ ఆక్సిజన్‌ ప్లాంట్ను ప్రైవేటీ సంస్థలకు అప్పజెప్పుతోందని విమర్శించారు. .సొంత గనులను కేటాయించ లేదని, దిగుమతి చేసుకున్న ముడిసరుకును అన్లోడ్‌ చేసి స్టీల్స్టాంటు ఇవ్వడానికి గంగవరం పోర్టు ఉద్దేశ్య పూర్వకంగానే ఇబ్బందులు పెడుతోందని దుయ్యబట్టారు.ఇప్పటికే 1400 ఎకరాల స్టీల్‌ ప్లాంట్‌ జోన్ను గంగవరం పోర్టుకు ఇచ్చారని మరిన్ని భూములను ధారదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని చైతన్య పరచాలనే ఉద్దేశ్యంతో సిపిఎం ఈ నెల 20 నుండి 29 వరకు 10 రోజులు ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టిందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 25న అరకు, పాడేరు 26న చింతపల్లి మీదగా నర్సీపట్నం కు యాత్ర సాగుతుందని అన్నారు. ఈ యాత్రలో విద్యావంతులైన ప్రజలు, విద్యార్థులు, మేధావుల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం నాయకులు బత్తిరి నరేష్‌, మత్య రాజు, సింహాద్రి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.